
- ఎక్కడి నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం
- అరెస్టుల వివరాలను పోలీస్ స్టేషన్లో ప్రదర్శించాలి
- జులై 1 నుంచే అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. దీంతో పోలీస్ స్టేషన్ల జూరిస్ డిక్షన్ తో సంబంధం లేకుండా ఇకపై ఎక్కడి నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్ లైన్ లో కూడా ఫిర్యాదు చేసేందుకు వీలు కానుంది.
బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(ఐఈఏ)ల స్థానంలో కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియమ్ 2023 బిల్లులను పార్లమెంట్ గత ఏడాది ఆమోదించింది. ఈ చట్టాలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి.
కొత్త చట్టాల్లోని ఇతర కీలకాంశాలు ఇవే..
బాధితులకు వేగంగా, తగిన న్యాయం జరిగేలా చూసేందుకు గాను కొత్త క్రిమినల్ చట్టాల్లో అనేక మార్పులను కేంద్రం ప్రవేశపెట్టింది. కొత్త చట్టాల ప్రకారం.. సమన్లు కూడా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయవచ్చు. దారుణమైన నేరాలు జరిగిన సందర్భాల్లో నేరం జరిగిన ప్రాంతాన్ని తప్పనిసరిగా వీడియో తీయాలి. సాక్ష్యాలు సేకరించే క్రమాన్ని సైతం పూర్తి స్థాయిలో వీడియో చిత్రీకరించాల్సి ఉంటుంది. బాధితులతోపాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీలను ఉచితంగా అందజేయాలి.
అరెస్టు సమయాల్లో నిందితులు తమ వాళ్లకు తమ పరిస్థితిని తెలియజేసే అవకాశం కల్పించాలి. అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రదర్శించాలి. చిన్నారులు, మహిళలపై నేరాలను త్వరగా దర్యాప్తు చేయాలి. పిల్లలు, మహిళలపై నేరాల్లో బాధితులకు ఉచిత వైద్యం అందించాలి. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడం కోసం గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి. మహిళలు, 15 ఏండ్లలోపు పిల్లలు, 60 ఏండ్లు పైబడినవాళ్లు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు నివాసం ఉన్న చోటు నుంచే పోలీసుల సాయం పొందవచ్చు.