
- ఎక్కడ సమస్య వచ్చినా సమీపంలోని సిబ్బందికి మెసేజ్
- జిల్లాలో మొదటగా 11 కేవీ 131 ఫీడర్లకు, 33 కేవీ 6 ఏరియాల్లో ఫిట్టింగ్
పెద్దపల్లి, వెలుగు: ప్రజలకు మెరుగైన, అంతరాయం లేని కరెంట్‌ను అందించడానికి విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధమయ్యారు. పెద్దపల్లి జిల్లాలో నిరంతర విద్యుత్ సప్లైకి ఎన్‌పీడీసీఎల్ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ఒకవేళ ఎక్కడైనా అంతరాయం కలిగినా సమీపంలోని కరెంట్ సిబ్బంది ఫోన్లకు మెసేజ్ వచ్చేలా ఫాల్ట్ప్యాసివ్ఇండికేటర్(ఎఫ్‌పీఐ)లను అమర్చనుంది. ముందుగా 11 కేవీ, 33 కేవీ లైన్లలో ఎఫ్‌పీఐలను అమర్చనున్నారు. ఎక్కువగా ఇంటీరియల్ఏరియాల్లో వీటిని అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలో వీటిని అమర్చగా.. పెద్దపల్లిలోనూ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
హాట్ స్పాట్స్ గుర్తింపు
ఇప్పటికే కరెంట్ సప్లైకి అంతరాయం కలుగుతున్న హాట్‌స్పాట్స్‌ను విద్యుత్‌శాఖ అధికారులు గుర్తించారు. ఎక్కువగా సమస్యలున్న ఫీడర్లకు ఈ పరికరాలను ఫిట్ చేయనున్నారు. అంతరాయం కలగగానే సమీప అధికారులకు మెసేజ్ వస్తుంది. దీంతో నిమిషాల్లో స్పాట్‌కు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంది. జిల్లాలోని ప్రతి రెండు మండలాలకు ఓ 33కేవీ ఫీడర్ నుంచి కరెంట్ సప్లై అవుతుంది. ఆయా మండలాల పరిధిలో ఎక్కడైనా సమస్య ఏర్పడితే మొత్తం పవర్ కట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
దీంతోపాటు సిబ్బంది పోల్ టూ పోల్ తిరిగి సమస్య ఎక్కడుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో టైం వేస్ట్ కావడంతో పాటు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గుర్తించిన హాట్‌స్పాట్లలో ఎఫ్‌పీఐలను అమర్చుతారు. వీటిల్లో సిమ్‌కార్డు ద్వారా మెసేజ్ జనరేట్అయ్యేలా సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. సప్లైలో సమస్య ఏర్పడగానే సమీపంలోని సబ్‌స్టేషన్‌తోపాటు సంబంధిత అధికారుల సెల్‌ఫోన్‌లకు మెసేజ్వస్తుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై స్పాట్‌కు చేరుకొని సమస్యను పరిష్కరించే అవకాశముంది.
ఒక్కో ఎఫ్‌పీఐకి రూ.1.20లక్షలు
జిల్లాలో మొత్తం 4.50 లక్షల వ్యవసాయ, గృహ కనెక్షన్లు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 7 సబ్డివిజన్లు, 11కేవీ ఫీడర్లు 320, 33కేవీ 34.. మొత్తంగా 354 ఫీడర్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 33 కేవీ లైన్లలో పరిధిలో 6 ఎఫ్‌పీఐలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 11 కేవీ లైన్ల పరిధిలో 131 ఎఫ్‌పీఐలు అమర్చనున్నారు. ఒక్కోదానికి రూ. 1.20 లక్షలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
ఎఫ్‌పీఐలతో క్వాలిటీ పవర్
ఎఫ్‌పీఐలతో ప్రజలకు క్వాలిటీ పవర్అందించే అవకాశం ఉంది. వర్షాకాలంలో కరెంటుకు అంతరాయం కలిగితే సమస్యను తెలుసుకోవడానికి చాలా టైం పట్టేది. మిగిలిన ప్రజలకు విద్యుత్ సప్లైకి అంతరాయం ఉండేది. ఎఫ్‌పీఐలు అమర్చితే ఎక్కడ ప్లాబ్లమ్ ఏర్పడిందో మెసెజ్ ద్వారా తెలుస్తుంది. దీంతో నిమిషాల్లోనే సమస్య పరిష్కారం ఉంటది.
గంగాధర్, ఎస్ఈ, పెద్దపల్లి జిల్లా