
- మందుల ధరలపై కంపెనీలకు ఆదేశం
- నాన్-షెడ్యూల్డ్ డ్రగ్స్‌కు వర్తింపు
న్యూఢిల్లీ: మందుల ధరల పెరుగుదలను అరికట్టడానికి ఇండియా డ్రగ్ ప్రైసింగ్ రెగ్యులేటర్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్పీపీఏ, నాన్–షెడ్యూల్డ్ మందుల ధరల పెంపుదలను 10 శాతానికి పరిమితం చేసింది. ధరల నియంత్రణలో లేని మందులను నాన్–షెడ్యూల్డ్డ్రగ్స్ అని పిలుస్తారు. నేషనల్ మీడియా రిపోర్టుల ప్రకారం.. ఎన్పీపీఏ ఇక నుంచి ప్రభుత్వం నాన్- షెడ్యూల్డ్ డ్రగ్స్ సహా అన్ని మందుల గరిష్ట చిల్లర ధరలను (ఎంఆర్పీ) పర్యవేక్షిస్తుంది. ఏ కంపెనీ కూడా గత 12 నెలల్లో గరిష్ట చిల్లర ధరను పది శాతం కంటే ఎక్కువ పెంచకుండా చూస్తుంది.
డ్రగ్ కంపెనీలు ఇలాంటి మందుల ధరలను సంవత్సరానికి 10శాతం కంటే ఎక్కువ పెంచడానికి వీల్లేదు. ఒకవేళ పెంచితే, ధరను అనుమతించిన స్థాయికి తగ్గించాలి. అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ధరల పెంపుదల తేదీ నుంచి వడ్డీతో సహా అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. అదనంగా పెనాల్టీ కూడా విధిస్తామని ఎన్పీపీఏ హెచ్చరించింది.
ఈ సంస్థ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ), 2013లోని షెడ్యూల్ 1లో నాన్ లిస్టెడ్ డ్రగ్స్ ధరలను పర్యవేక్షిస్తుంది. వీటిని నాన్-షెడ్యూల్డ్ ఫార్ములేషన్స్ అని కూడా అంటారు. ఇప్పటివరకు వీటి ధరల విషయంలో నియంత్రణ లేదు. కంపెనీలు ఒకే మందును వేర్వేరు బ్రాండ్ పేర్లతో అధిక ధరలకు విడుదల చేసి నిబంధనలను తప్పించుకోకుండా నిరోధించడానికి, ఎన్పీపీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
మనదేశంలో అనేకమంది షుగర్, రక్తపోటు, డిప్రెషన్ వంటి సమస్యల చికిత్స మందులకు విపరీతంగా ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో ఎన్పీపీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) మనీషా ఖుంటియా సంతకం చేసిన ఈ మెమోను అన్ని ఫార్మా కంపెనీలకు, పరిశ్రమ సంఘాలకు పంపారు.