అక్బర్​నగర్​లో పగిలిన ఎన్టీపీసీ యాష్ పాండ్ పైప్ లైన్

అక్బర్​నగర్​లో పగిలిన ఎన్టీపీసీ యాష్ పాండ్ పైప్ లైన్
  • రెండు గంటలపాటు ఎగిసిపడిన బూడిదనీరు
  • రామగుండం అక్బర్​నగర్​లో ఇండ్లలోకి.. 
  • ఎలాంటి సహాయక చర్యలు చేపట్టని ఎన్టీపీసీ ఆఫీసర్లు 
  • సంస్థ నిర్లక్ష్యంపై మండిపడుతున్న కాలనీవాసులు 

గోదావరిఖని, వెలుగు :  రామగుండం అక్బర్​నగర్ వద్ద ఎన్టీపీసీ నుంచి కుందనపల్లిలోని యాష్​పాండ్​కు వెళ్లే పైపులైన్​పగిలిపోయింది. దీంతో సమీపంలోని ఇండ్లలోకి బూడిద నీరు పెద్ద ఎత్తున చేరింది. నీటి ప్రెషర్​కు కొన్ని ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. సామగ్రి అంతా బూడిదతో నిండిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీపీసీలో విద్యుత్​ ఉత్పత్తి కోసం బొగ్గును మండించడం ద్వారా వచ్చిన బూడిదను నీటితో కలిపి పైపులైన్ల ద్వారా కుందనపల్లి వద్ద యాష్​పాండ్​కు తరలిస్తారు. 

బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బూడిద నీరు లీకేజీ అయి పైపులైన్ల నుంచి ఒక్కసారిగా ఎగిసిపడింది. దీంతో స్థానికులు భయపడి పరుగులు తీశారు. సుమారు 20 ఇండ్లలో మీటరు​నుంచి రెండు మీటర్ల వరకు బూడిద పేరుకుపోయింది. లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్లు కూడా బూడిదతో నిండి నడవలేని స్థితి నెలకొంది.  రెండు గంటల పాటు పైపులైన్ల నుంచి బూడిద నీరు ఎగిసిపడగా, సరఫరాను నిలిపివేయడం తప్ప ఎన్టీపీసీ మేనేజ్​మెంట్​ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. 

బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు కూడా ఆఫీసర్లు వెళ్లకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. ఎన్టీపీసీకి చెందిన బూడిద పైపులైన్​కు సరైన మెయింటనెన్స్​చేయకపోవడంతోనే లీకేజీ ఏర్పడిందని, దీనికి ఆ సంస్థ మేనేజ్​మెంట్​ పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్​జిల్లా కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్​డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.