
కాళేశ్వరం ఆలయాభివృద్ధికి ఎన్టీపీసీ విరాళం
మహాదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి ఎస్టీపీసీ రూ.80లక్షల విరాళం ఇచ్చినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. మంగళవారం ఆయన మహాదేవపూర్ లో పర్యటించారు. నేషనల్ హైవే 353(సి)కి ఇరువైపులా హరితహారం మొక్కలను పరిశీలించారు. ఒక్కో మొక్క సంరక్షణ కోసం రూ.250 కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైవే పొడవునా మొక్కలు నాటడానికి అదనంగా రూ.కోటి కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆఫీసర్లు ప్రతి మొక్కనూ కాపాడాలన్నారు. అనంతరం దివ్యాంగుల శిబిరాన్ని తనిఖీ చేశారు. దివ్యాంగులతో మాట్లాడి, వారి బాగోగులు, కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు రాణిబాయి, కురుసం బుచ్చక్క, జడ్పీటీసీ గుడాల అరుణ
తదితరులున్నారు.
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
సీపీ తరుణ్ జోషి
హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో గణపతి విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఈ నెల 9న వరంగల్ ట్రై సిటీ పరిధిలో నిమజ్జనం నేపథ్యంలో మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. పోలీస్, బల్దియా, విద్యుత్తు, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖలతో కలిసి చెరువులను పరిశీలించారు. బంధం చెరువు, ఉర్సు చెరువు, చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, సిద్దేశ్వరగుండం, హసన్‌పర్తి పెద్ద చెరువులను సందర్శించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. నిమజ్జనం కోసం క్రేన్ల వినియోగం, సీసీ కెమెరాలు, విద్యుత్తు సౌకర్యం, గజ ఈతగాళ్లు, పోలీస్ కంట్రోల్ రూంల ఏర్పాటు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ అనుమతి లేని చెరువుల్లో నిమజ్జనం చేయొద్దన్నారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, ఏసీపీలు మధుసూధన్, గిరికుమార్, కిరణ్ కుమార్, సీఐలు సీహెచ్ శ్రీనివాస్ జీ, రమేష్, మల్లేషం, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, నరేందర్, ట్రాఫిక్ సీఐలు బాబులాల్, రామకృష్ణ, రవికుమార్ తదితరులు ఉన్నారు.
అర్హులంతా ఓటర్లుగా చేరాలి
ములుగు, వెలుగు: 18 ఏండ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఓటరు నమోదు ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో అర్హులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. మరణించిన వారి ఓట్లను వెంటనే తొలగించాలన్నారు. అలాగే మహిళా సంఘాలు, బూత్ స్థాయి ఆఫీసర్లు ఓటర్– ఆధార్ కార్డ్ లింక్ చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవి గణేశ్, డీఆర్వో కె.రమాదేవి, కలెక్టరేట్ ఏవో విజయ భాస్కర్ తదితరులున్నారు.
ఆధార్ తో ఓటు లింక్ చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: నకిలీ, డబుల్ ఓట్లను తొలగించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో విద్యాసంస్థల ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు.18 ఏండ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు సహకరించాలన్నారు. సిబ్బంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి ఆధార్ ను ఓటుతో లింకేజ్ చేయించాలన్నారు.
మావోయిస్టులకు సహకరించొద్దు
కొత్తగూడ, వెలుగు: మావోయిస్టులకు ప్రజలు సహకరించవద్దని మహబూబాబాద్ డీఎస్పీ సదయ్య సూచించారు. ప్రతిఒక్కరూ ‘నక్సలైట్స్ గోబ్యాక్’ నినాదాన్ని పాటించాలన్నారు. మంగళవారం ఆయన గంగారం మండలం కోమట్లగూడెం,పెద్దెల్లాపూర్, జంగాలపల్లి గ్రామాల్లో పర్యటించారు. అనంతరం కొత్తగూడ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీలో మవోయిస్టుల కదలికలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మావోయిస్టుల సమాచారం అందిస్తే ప్రజలకు తగిన పారితోషికం ఇస్తామన్నారు. ఆయన వెంట గూడూరు సీఐ యాసిన్, కొత్తగూడ, గంగారం ఎస్సైలు నగేశ్, ఉపేందర్ ఉన్నారు.
అటవీ గ్రామాల్లో తనిఖీలు..
మహాముత్తారం, మహాదేవపూర్, వెలుగు: మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల మండలాల్లోని అటవీ గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఎస్సైలు రమేశ్, రాజ్ కుమార్, అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. స్తంభంపల్లి(పీకే)లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి సూసైడ్
మల్హర్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి సూసైడ్ చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారంలో జరిగింది. గ్రామానికి చెందిన మద్దూరి మహేశ్(30) కూలీగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎదురై కుటుంబపోషణ భారంగా మారింది. దీంతో సోమవారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించగా... మంగళవారం చికిత్స పొందుతూ చనిపోయాడు.
జీవితంపై విరక్తి చెంది..
మహాముత్తారం: మహాముత్తారం మండలం వజినేపల్లికి చెందిన బొచ్చు దుర్గయ్య(46) జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దుర్గయ్య కొద్దిరోజులుగా ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. కుటుంబాన్ని పోషించలేనని మనస్తాపం చెంది, సోమవారం పాయిజన్ తాగాడు. బంధువులు అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం
చనిపోయాడు.
ఈ నెల 17 నుంచి.. ఉద్యమకారుల పాదయాత్ర
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో గాయపడిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించింది. ఇందుకు నిరసనగా వారంతా మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ గన్ పార్క్ వరకు పాదయాత్ర చేయనున్నారు. వివరాల్లోకి వెళితే.. 2010లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా జిల్లాకు వస్తుండగా.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో తెలంగాణ ఉద్యమకారులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా.. పలువురికి గాయాలయ్యాయి. గతంలో వీరిని సీఎం కేసీఆర్ పరామర్శించి, గాయపడ్డవారికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిగా విస్మరించారు. తాజాగా సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినోత్సవం నాడు మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు బాధిత ఉద్యమకారులు భూక్య శోభన్‌బాబు, వాంకుడోత్ హచ్యా, బొందెకోల పౌల్రాజ్, తోట రవి, భూమా ముదాకర్, సయ్యద్ ఇమాం, కేలోత్ హతిరాం, దిడ్డి వెంకటేశ్, బానోత్ రంగ్యా, గుగులోత్ బిచ్యా, గుగులోత్ రావోజీ తెలిపారు.
బీజేపీ పార్లమెంట్ కోకన్వీనర్ ఎన్నిక
నర్సంపేట, వెలుగు: మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ కోకన్వీనర్‌గా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన జాటోతు సంతోష్‌నాయక్‌ను నియమిస్తూ ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. నెక్కొండ మండలం వెంకటాపురానికి చెందిన ఆయన.. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా సంతోష్ నాయక్ మాట్లాడుతూ.. తన నియామకానికి కృషి చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, స్టేట్జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
టేకుమట్ల పీఎస్ ను తనిఖీ చేసిన సెంట్రల్ టీం
మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: దేశంలోని టాప్–10 పోలీస్ స్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఏటా ర్యాంకులు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తొలివిడతగా 75 స్టేషన్లు ఎంపిక చేయగా.. అందులో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పీఎస్ ఉంది. ఈ 75 స్టేషన్లను తనిఖీ చేసి, టాప్–10 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తారు. మంగళవారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టీం టేకుమట్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసింది. స్టేషన్ పరిసరాలతో పాటు కేసుల రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ, సైబర్ నేరాలు తదితర అంశాలపై ఆఫీసర్లు ఆరా తీశారు. ప్రజలతో మెలుగుతున్న తీరు, చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. స్థానిక ప్రజలతోనూ మాట్లాడి, వివరాలు సేకరించారు. కాగా, తమ స్టేషన్‌కు టాప్ –10 ర్యాంక్ సాధిస్తుందని ఎస్సై తమాషా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో ఉద్యమకారుడు మృతి
నెక్కొండ, వెలుగు: అనారోగ్యంతో తెలంగాణ ఉద్యమకారుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన బక్కి చందు(35) కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్ డీ పూర్తి చేశాడు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. ఇటీవల లివర్ డ్యామేజీ అయి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబసభ్యులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆమె వెంట ఎంపీపీ రమేశ్, సర్పంచ్ బక్కి రాజమ్మ ఉన్నారు.
పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా?
వరంగల్ సిటీ, వర్ధన్నపేట, వెలుగు: పిల్లల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కలేదని, కేసీఆర్ కు పిల్లల ఉసురు తగులుతుందని బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న వర్ధన్నపేట హాస్టల్విద్యార్థులను మంగళవారం ఆయా పార్టీల నాయకులు వేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో హాస్టళ్లలో సరైన అన్నం పెట్టే దిక్కులేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, విద్యార్థుల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. సంపాదనపై పెట్టిన దృష్టి.. పిల్లల ఆరోగ్యంపై పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి,బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొంటేడి శ్రీధర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నమిండ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.
రూ.4లక్షల గంజాయి పట్టివేత
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ రైల్వే స్టేషన్లో రూ.4లక్షల గంజాయి పట్టుబడింది. జీఆర్పీ సీఐ నరేశ్వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఫ్లాట్ ఫాం నెం.2 పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని విచారించగా.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రవీణ్, ఇంత్ జాగా గుర్తించారు. వారి వద్ద బ్యాగులు చెక్ చేయగా.. 40 కేజీల ఎండు గంజాయి పట్టుబడింది. వీరు ఢిల్లీకి వెళ్లే రైలు కోసం వెయిట్ చేస్తున్నారు. భద్రాచలం నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ కు, ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారు. ఇరువురిని అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించామన్నారు.
సిటిజన్లకు మరిన్ని సౌలతులు కల్పిస్తాం
వరంగల్ మేయర్ గుండు సుధారాణి
కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: యునెస్కో గ్లోబల్ నెట్ వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో వరంగల్ సిటీకి చోటుదక్కడం పట్ల మేయర్ గుండు సుధారాణి ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం కమిషనర్ ప్రావీణ్యతో కలిసి 42, 46, 47 డివిజన్ల పరిధిలో నగర బాట నిర్వహించారు. కాజీపేట, మడికొండలోని కాలనీల్లో సమస్యలు తెలుసుకున్నారు. మేయర్ మాట్లాడుతూ.. దేశంలో ఎంపికైన మూడు సిటీల్లో వరంగల్ కు స్థానం దక్కడం అందరికీ గర్వకారణమన్నారు. స్మార్ట్ సిటీ, పట్టణప్రగతితో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజలకు మరిన్ని సౌలతులు కల్పించి, సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మునిగాల సరోజన కరుణాకర్, సంకు నర్సింగ్ తదితరులున్నారు.