తమిళనాట కూడా ఆడపిల్లలు తగ్గుతున్నరు

తమిళనాట కూడా ఆడపిల్లలు తగ్గుతున్నరు

దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడును దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా పరిగణిస్తారు. సోషల్​ ఇండికేటర్స్​లో ​ఇతర రాష్ట్రాల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్లు స్టడీలు చెబుతున్నాయి. అక్కడ చదువు, ఉద్యోగాల్లో ఆడవాళ్లు ముందంజ వేస్తున్నారని; డొమెస్టిక్​ వయొలెన్స్​పై గళం విప్పుతున్నారని రెండేళ్ల కిందటి స్టేట్​ హ్యూమన్​ డెవలప్​మెంట్​ ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. దీనికి భిన్నమైన పరిస్థితులు ఈమధ్య నెలకొన్నట్లు సెక్స్​ రేషియో లెక్కలను బట్టి అర్థమవుతోంది.

హ్యూమన్​ డెవలప్​మెంట్​ ఇండెక్స్​ రిపోర్ట్​ ప్రకారం 16 శాతం మంది పేరెంట్స్​ తమకు మగ పిల్లలు పుట్టాలని కోరుకుంటుండగా 7–9 శాతం మంది మాత్రం అమ్మాయిలు కావాలని అంటున్నారు. మెజారిటీ దంపతులు​ తమకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుడితే బాగుండని ఆశిస్తున్నారు. వాళ్ల అంచనాలు తలకిందులైనప్పుడు అబార్షన్​ చేయిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మగ పిల్లల సంఖ్యతో పోల్చితే ఆడ పిల్లల సంఖ్య పుట్టుక సమయంలోనే భారీగా తగ్గిపోతోంది. సెక్స్​ రేషియోలో తమిళనాడు ఉత్తరాది రాష్ట్రాల కన్నా వెనకబడ్డట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బర్త్​ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సివిల్​​ సిస్టమ్​ రికార్డులు ఈ ఆందోళనకర అంశాన్ని తెలిపాయి. రాష్ట్రంలో గత ఐదేళ్లలో సెక్స్​ రేషియో 918 నుంచి 931కి పెరిగింది. కానీ ఈ పాజిటివ్​ పిక్చర్​ రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా లేదు. గతంలో మంచి​ పొజిషన్​లో ఉన్న జిల్లాలు ఇప్పుడు వరస్ట్​గా తయారయ్యాయి.

1990ల్లో సేలం, ధర్మపురి, విల్లుపురం, నమక్కల్​ తదితర నార్త్​, సెంట్రల్​ తమిళనాడు జిల్లాల్లో ఆడ పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉండేది. అమ్మాయిలను పుట్టీ పుట్టగానే విసిరి పారేయడమో, లేదా గొంతు పిసికి చంపేయడమో వంటివి జరిగేవి. ఈ  క్రిమినల్​ కల్చర్​ని తెరదించటానికి ప్రభుత్వం అప్పట్లో చర్యలు చేపట్టింది.  జయలలిత మొదటిసారి 1991లో అధికారానికి రాగానే, సేలం జిల్లాలో ‘క్రెడిల్ బేబీ స్కీమ్​’కి రూపకల్పన చేశారు. ఇది ‘ఊయల పథకం’గా అక్కడ ప్రచారంలోకి వచ్చింది. ఆడ బిడ్డను పెంచుకోవటానికి ఇష్టపడని భార్యాభర్తలు ఆ పిల్లలను ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటుచేసే ఊయలలో పడుకోబెట్టి వెళ్లాలని, ఉసురు తీయొద్దని కోరారు. ‘ఆ చిట్టితల్లుల బాగోగులను ఇక మేం చూసుకుంటాం. దయచేసి వాళ్ల ప్రాణాలను పురిట్లోనే తీయొద్దు. పుట్టి భూమ్మీదకు రాకముందే కడుపులోనే చంపేద్దామనే ఆలోచనలు, ప్రయత్నాలు మానండి’ అని ప్రచారం చేయడంతో  ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మూడు జిల్లాల్లో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిల సంఖ్య ఆ రోజుల్లో భారీగా పెరిగింది. అయితే.. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తంజావూర్​, తిరువారూర్​, కోయిల్​పట్టి, పరమకుడి తదితర సౌత్​, ఈస్ట్​ జిల్లాల్లో ఈమధ్య సెక్స్​ రేషియో (పుట్టుక సమయంలో) బాగా పడిపోయినట్లు డేటా చెబుతోంది. తంజావూర్​లో 2014లో 1000 మంది మగ పిల్లలకు ఆడ పిల్లల సంఖ్య 914 ఉంది. ఇది 2017 నాటికి 950కి పెరిగి, 2018లో 908కి తగ్గింది. ఇటీవల ఇతర జిల్లాల్లోనూ ఈ తగ్గటాలు, పెరగటాలు చోటుచేసుకుంటున్నాయి. కడలూరులో 2013–14లో అమ్మాయిల సంఖ్య 848 ఉండగా, 2017–18లో 926కి చేరి ప్రస్తుతం 917కి పడిపోయింది.

రాజకీయ ఒత్తిళ్లతో ఆగని అబార్షన్లు

పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో తెలుసుకునే పరీక్షలతోపాటు ఆడపిల్ల వద్దనుకుంటే అబార్షన్లు చేస్తున్న దాదాపు 23 మంది డాక్టర్లను 2013–16లో అరెస్ట్​ చేశారు. అయితే ఇలాంటి క్లీనిక్​లపై ఆఫీసర్లు చర్యలు తీసుకునే విషయంలో రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో ఇన్​స్పెక్షన్​ కమిటీలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిందితులను అరెస్ట్​ చేసి జైల్లో పెట్టినా… కొద్ది రోజులకే బెయిల్​పై బయటకు వచ్చి, క్లీనిక్​లను వేరే ప్రాంతాలకు మార్చి మళ్లీ అవే నేరాలు చేస్తున్నారు. మైండ్​సెట్​ మార్చే పాలసీలు రావాలి

జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ‘ఊయల పథకం’ద్వారా వెనకబడ్డ జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య పెరగటానికి దోహదపడ్డారు. ఇప్పుడు ఆ పథకం అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ పబ్లిక్​ మైండ్​సెట్​ మారింది. ఇప్పుడు ఆడపిల్లలను వద్దనుకునేవారు కాన్పు పూర్తయ్యేవరకు ఆగడంలేదు. వాళ్లను కడుపులోనే వదిలించుకోవటానికి దార్లు వెతుకుతున్నారు.

సెలెక్టివ్​ అబార్షన్లదే ఈ పాపం

ఆడ పిల్లల సంఖ్య ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఎందుకు ఉంటోందో అర్థం కావట్లేదు. కానీ.. సెక్స్​ సెలెక్టివ్​ అబార్షన్ల సంఖ్య పెరగటమే దీనికి ముఖ్య కారణమని నిపుణులు అంటున్నారు. అబార్షన్ల వల్లే చాలా జిల్లాల్లో 2016–19 మధ్య కాలంలో పుట్టిన ఆడ పిల్లల సంఖ్య 900 లోపుకే పరిమితమైందని ‘ప్రి–కాన్సెప్షన్​ అండ్​ ప్రి–నాటల్​ డయాగ్నాస్టిక్​ టెక్నిక్స్​ యాక్ట్’ జాతీయ మానిటరింగ్​ కమిటీ సభ్యుడు, రీసెర్చర్​ సాబూ జార్జ్​​ చెప్పారు.

రిజిస్ట్రేషన్లతో చెక్​ పెట్టారిలా..

పీహెచ్​సీలకు టెస్ట్​లకు వెళ్లిన గర్భిణీల వివరాలను గత ఏడాది నుంచి నమోదు చేయటం ప్రారంభించారు. ఆ డేటాను ఫస్ట్​, సెకండ్​, థర్డ్​ ట్రైమెస్టర్​ ప్రెగ్నెన్సీ కేటగిరీలుగా విభజించి, వాటిని సెకండ్​ ట్రైమెస్టర్​ అబార్షన్ల లెక్కలతో పోల్చి చూశారు. దీంతో ఏయే ప్రాంతాల్లో ప్రీ–నాటల్​ డయాగ్నస్టిక్​ టెస్టులు, సెక్స్​ సెలెక్టివ్​ అబార్షన్లు ఎక్కువ జరుగుతున్నాయో గుర్తించారు. ఈ నేరాలకు చెక్​ పెట్టడానికి టీమ్​లు ఏర్పాటు చేసి స్కానింగ్​ సెంటర్లపై దాడులు చేపట్టారు.

ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే… దక్షిణాదిలో ఆడపిల్లలపై చిన్నచూపు ఉండదంటారు. ఇంట్లో మహాలక్ష్మి పుట్టినంత సంబురం చేసుకుంటారని చెబుతారు. కానీ, ఇప్పుడు సౌత్​లోనూ తీరు మారింది. తమిళనాడులో  ఆడపిల్లలు తగ్గుతున్నారు. జయలలిత మొదటిసారి సీఎం కాగానే, 1992లో క్రెడిల్​ బేబీ స్కీమ్​ ప్రవేశపెట్టారు ‘అమ్మాయి పుడితే పెంచుకోవటం ఇష్టం లేనోళ్లు మాకివ్వండి. మేం ఏర్పాటుచేసిన ఊయలలో పడుకోబెట్టి వెళ్లండి’ అని  చేసిన ప్రచారం సక్సెస్​ అయింది. అప్పట్లో సెక్స్​ రేషియో బాగానే పెరిగింది. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.