
- వచ్చే నెల 19 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరణ
- కొత్త ఓటర్లు 8.31 లక్షల మంది
- 10.82 లక్షల ఓట్లు తొలగింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరింది. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీ సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333 అని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అందులో పురుషులు 1.53 కోట్ల మంది, మహిళలు 1.52 కోట్ల మంది, ఇతరులు 2,133 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ ఓటర్లు 2,742 మంది, సర్వీసు ఓటర్లు 15,337 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు వారి సంఖ్య 4,76,597గా ఉన్నట్లు సీఈవో తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,99,77,659 గా ఉంది.
అప్పట్నుంచి కొత్తగా 8,31,520 మందిని ఓటరు జాబితాలో చేర్చగా.. 10,82,183 మంది పేర్లను తొలగించారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్పై సెప్టెంబర్ 19వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు సమర్పించవచ్చని సీఈఓ తెలిపారు. అర్హత ఉండి, ఓటు హక్కు లేనివారెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తమ ఓటును అకారణంగా తొలగించినట్లు ఎవరైనా భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతివారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలను ఆదేశించారు. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.
అత్యధికంగా శేరిలింగంపల్లిలో ఓటర్లు
రాష్ట్రంలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,62,552 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,39656 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,44,170 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 40,30,989 మంది ఓటర్లు ఉన్నట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు. అందులో పురుష ఓటర్లు 22,09,972 మంది, మహిళా ఓటర్లు 20,90,727 మంది ఉన్నారు. ఇతరుల ఓట్లు 290. సిటీ పరిధిలో అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,56,995 మంది, అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 2,16,648 మంది ఓటర్లు ఉన్నారు.