ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లకు బిగ్ షాక్ .. అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా

  ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లకు బిగ్ షాక్ ..  అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా

టెక్ దిగ్గజాలు ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అమెరికాకు చెందిన సెమీకండక్టర్ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా అవతరించింది. ఎన్విడియా షేర్లు  జూన్ 18వ తేదీ మంగళవారం రోజున  దాదాపు 3.5% పెరిగాయి. ఈ పెరుగుదలతో  దాని మార్కెట్ విలువ 3.32 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు 276 లక్షల కోట్లు)కు పెరిగింది. ఈ దూకుడుతో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్‌లను ఎన్విడియా గద్దె దించింది. 

అంతకుముందు అంటే జూన్ 5వ తేదీన  ఎన్విడియా యాపిల్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో కంపెనీగా అవతరించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌కు అవసరమైన చిప్‌లను ఎన్‌విడియా తయారు చేస్తోంది. దీనిని 1993లో జెన్సన్ హువాంగ్, కర్టిస్ ప్రీమ్, క్రిస్ మలాచోవ్స్కీ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉంది. గత కొన్నేళ్ళుగా ఈ సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరగడంతో అమ్మకాలు, లాభాలు ఊపందుకున్నాయి.