- హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్
- రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇస్తానన్న రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు మరో 46 హామీలను ఇచ్చిందన్నారు.
వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు భరోసా కింద రూ.15 వేలు, రైతు కూలీలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని ఇప్పటి వరకు వాటి ఊసేత్తడం లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న అమలు చేస్తామని ప్రకటించిన వాగ్దానాలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే నెరవేర్చుతామని అబద్దపు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని కోరారు.
ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి
పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9904119119 ఏర్పాటు చేయించారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.