లాభాల బాటలో ఐఓసీ : నాలుగో క్వార్టర్‌‌‌‌లో అదరగొట్టింది

లాభాల బాటలో ఐఓసీ : నాలుగో క్వార్టర్‌‌‌‌లో అదరగొట్టింది

ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌‌‌‌లో అదరగొట్టింది. ‌‌గత క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే ఈ నాలుగో క్వార్టర్‌‌‌‌లో కంపెనీ నికర లాభం 17 శాతం పెరిగి రూ.6,099 కోట్లకు చేరుకుంది.  ఇన్వెంటరీ, ఫారిన్ ఎక్స్చేంజ్ లాభాలు, అధిక రిఫైనరీ మార్జిన్లతో నికర లాభం కూడా పెరిగినట్టు కంపెనీ తెలిపింది. జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో టర్నోవర్‌‌‌‌ రూ.1.44 లక్షలకు పెరిగింది. గతేడాది ఇది రూ.1.37 లక్షల కోట్లుగా ఉంది.  అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకోవడంతో కంపెనీ ఇన్వెంటరీ గెయిన్స్‌‌ను పొందినట్టు పేర్కొంది. అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్‌‌గా రూ.837 కోట్లను ఆర్జించింది.

గతేడాది ఫారెక్స్ లాస్ రూ.676 కోట్లుగా ఉంది. ఇన్వెంటరీ గెయిన్ అంటే కంపెనీ ముడి సరుకును(క్రూడాయిల్) అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొని, ఆ తర్వాత దాన్ని ఇంధనంగా మార్చినప్పుడు దాని రేట్లు పెరగడం. ఇలా రేట్లు పెరిగినప్పుడు ఐఓసీ లాంటి రిఫైనర్లు ఇన్వెంటరీ గెయిన్‌‌ పొందుతాయి.  దేశీయ ఇంధన అమ్మకాలు 4.1 శాతం పెరిగి21.66 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కుకింగ్ ఫ్యూయల్ సబ్సిడీల కింద రూ.19 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఐఓసీ డైరెక్టర్(ఫైనాన్స్) ఏకే శర్మ చెప్పారు. దీంతో కంపెనీ రుణాలు తీసుకోవడం పెరిగిందని, 2019 మార్చి 31 నాటికి తమ రుణం రూ.86,359 కోట్లకు పెరిగినట్టు పేర్కొన్నారు. ఈ రుణం గతేడాది ఇదే సమయానికి రూ.58,030 కోట్లుగా ఉంది.  పూర్తి ఏడాదికి ఐఓసీ టర్నోవర్‌‌ రూ. 6.05 లక్షల కోట్లకు పెరిగింది.