కాంగ్రెస్​లో పెరిగిన జోష్ .. కారు స్పీడ్​కు బ్రేక్ వేస్తరా?

కాంగ్రెస్​లో పెరిగిన జోష్ .. కారు స్పీడ్​కు బ్రేక్ వేస్తరా?

షాద్ నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా షాద్ నగర్ సెగ్మెంట్​పై అంతటా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసిన బీఆర్ఎస్ తిరిగి అదే జోరును కొనసాగిస్తుందా? లేదంటే కాంగ్రెస్  తన పూర్వ వైభవాన్ని దక్కించుకుంటుందా?  లేక ఆ రెండు పార్టీల మధ్య పోరులో కాషాయ జెండా ఎగురుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ వచ్చాక 2014లో తొలిసారి గులాబీ పార్టీ గెలిచింది. ఆ తర్వాత 2018లోనూ మరోసారి తన సత్తా చాటింది. రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గెలుపొందారు. మూడోసారి తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుంటుండగా.. కారు స్పీడుకు కాంగ్రెస్, బీజేపీ బ్రేక్​లు వేస్తాయా..? అనే ఉత్కంఠ నెలకొంది. 

 తొలిసారి గెలిచి సీఎం పదవి చేపట్టి..

1952లో షాద్ నగర్ సెగ్మెంట్ ఏర్పడింది. తొలిసారిగా బూర్గుల రామకృష్ణారావు ఎమ్మెల్యేగా గెలుపొంది హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత11 సార్లు కాంగ్రెస్  గెలుపొందింది. దీంతో పార్టీకి షాద్ నగర్ కంచుకోటగా మారింది.1985లో ఎం. ఇందిర, 1994లో బక్కని నరసింహులు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలంగాణ వచ్చాక 2014, 2018లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  విజయం సాధించారు. 

బీసీల ఓట్లు ఎవరికో..

బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, బీజేపీ అభ్యర్థి అందె బాబయ్య ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ముగ్గురూ బీసీ క్యాండిడేట్లు కావడంతో నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. ఒకరు రెండుసార్లు గెలుపొంది, హ్యాట్రిక్ కొట్టాలనుకుంటుండగా.. మిగతా ఇద్దరు గెలుపే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీసీ కోటాలో అధిక ఓట్ల వాటా సాధించేది ఎవరు? షాద్​నగర్​లో గెలిచేదెవరూ? అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తుంది. 
 
చేరికలతో పుంజుకున్న హస్తం 

అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీలు తాండ్ర విశాల, వెంకటరామిరెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక, కొత్తూరు ఉమ్మడి మండలం మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్​లో చేరారు. ముఖ్యమైన నేతలు శంకర్​కు మద్దతుగా పార్టీలోకి రావడంతో  ఆయన అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరారు.

దీంతో షాద్​నగర్​లో రాజకీయ వ్యూహాలు రోజురోజుకు మారుతున్నాయి. రజక సామాజిక వర్గానికి చెందిన వీర్లపల్లి శంకర్​కు బీసీల మద్దతు అవసరం.  ఆ వర్గం వారి ఓట్లను ఏ మేరకు కొల్లగొడతాడనే దానిపైనే ఆయన గెలుపు ఆధారపడి ఉంది. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పక్క ప్లాన్​తో శంకర్ ప్రజల్లోకి వెళ్తున్నారు.