PAK vs BAN: పోరాటం ముగిసింది.. వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్

PAK vs BAN: పోరాటం ముగిసింది.. వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్

తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా! భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రయాణం అచ్చం ఇదే తరహాలో సాగింది. టాస్ వేశామా.. ఆడామా... ఓడామా! అన్నట్లు సాగిపోయింది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లా ఆరింట ఓటమి పాలైంది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దీంతో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా అవతరించింది.

టోర్నీ ప్రారంభానికి ముందు విభేదాలు

సరిగ్గా వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి నెల రోజుల ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఆ జట్టు ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, సీనియర్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓపెనర్‌గా తమీమ్‌ను ఆడించడానికి షకీబ్ అంగీకరించకపోవడంతో బంగ్లా మేనేజ్మెంట్ అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఆడాలని సూచించింది. అందుకు తమీమ్ ఒప్పుకోలేదు. ససేమిరా అని మొండికేశాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. అలా మొదలైన బంగ్లా ప్రయాణం ఏ దశలోనూ సరైన దారిలో నడవలేదు. ఆరంభ మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్‌పై విజయం మినహా మిగిలిన ఆరింట ఓటములే. చివరకు నెదర్లాండ్స్ చేతిలో కూడా బంగ్లా పులులు పరాభవాన్ని చవిచూశారు.

ALSO READ: PAK vs BAN: ఓటములకు విరామం.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘన విజయం

ఇంకో రెండు మ్యాచ్‌లు

ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌‌కు ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలివున్నాయి. నవంబర్ 6న శ్రీలంకతో, నవంబర్ 11న ఆస్ట్రేలియాతో తలపడాల్సివుంది. ఈ రెండింటిలో విజయం సాధిస్తే పరువైనా నిలబెట్టుకోవచ్చు. ఓడితే మాత్రం ఆ జట్టు అభిమానులు ఏమాత్రం సహించరు. ఇప్పటికే నెదర్లాండ్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ఓ బంగ్లా అభిమాని తనకు తాను చెప్పుతో కొట్టుకున్నాడు.   

  • నవంబర్ 6: బంగ్లాదేశ్ vs శ్రీలంక(ఢిల్లీ)
  • నవంబర్ 11: బంగ్లాదేశ్ vs ఆస్ట్రేలియా(పూణే)