జ్యోతిబసు రికార్డును బ్రేక్ చేసిన నవీన్‌ పట్నాయక్

జ్యోతిబసు రికార్డును బ్రేక్ చేసిన నవీన్‌ పట్నాయక్

దేశంలో  అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా   ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు.   పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం జ్యోతిబసు నెలకొల్పిన రికార్డు(23 సంవత్సరాల 139 రోజులు)ను ఆయన బ్రేక్  చేశారు.  దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు సిక్కిం సీఎంగా సేవలందించిన పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ (24 సంవత్సరాల 166 రోజులు) పేరిట ఉంది. నవీన్‌ పదవీకాలం వచ్చే ఏడాది మే వరకు ఉంది. ఒకవేళ 2024  ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీఎంగా బాధ్యతలు చేపడితే   చామ్లింగ్‌ రికార్డును ఆయన అధిగమిస్తారు. 

రాజకీయాల్లోకి  పట్నాయక్ అనుకోకుండా వచ్చారు.  ఆయనకు51 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రాజకీయ వర్గాల్లో ఆయన పేరు పెద్దగా పరిచయం లేదు. ఆయన తండ్రి, ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్ ఏప్రిల్ 17, 1997న మరణించడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.  2000 మార్చి5న  తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పట్నాయక్ . వరుసగా అయిదుసార్లు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. 

ఎంపీగా ఉన్న బిజూ పట్నాయక్‌ మరణంతో ఖాళీ అయిన ఆస్కా లోక్‌సభ స్థానం నుంచి నవీన్‌ పట్నాయక్‌ను జనతాదళ్‌ పార్టీ ఉప ఎన్నికల బరిలో దింపింది. ఎంపీగా గెలుపొందిన ఆయనకు కొద్దిరోజుల్లోనే జనతాదళ్‌ అగ్ర నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. దాంతో తన తండ్రి పేరిట బిజూ జనతాదళ్‌ (బిజద) పార్టీని ఏర్పాటు చేశారు. 1998, 1999 లలోక్‌సభ, 2000 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు కుదుర్చుకుని ఘన విజయాలు సాధించారు.2000 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన అదే ఏడాది మార్చి 5న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.