
హైదరాబాద్,వెలుగు: గోల్డ్ డిపాజిట్ అయ్యిందని చెప్పి సిటీలోని మణప్పురం ఫైనాన్స్ నుంచి డబ్బులు కొట్టేసిన ఒడిశా బ్రాంచ్‌కి చెందిన ఎంప్లాయ్‌తో పాటు అతడికి సహకరించిన నలుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల అకౌంట్లోని రూ.10. లక్షలను ఫ్రీజ్ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్ కి చెందిన ఆదిత్య నారాయణ్(33) అక్కడి మణప్పురం ఫైనాన్స్ లో పనిచేస్తున్నాడు. డోర్ స్టెప్ గోల్డ్ లోన్ స్కీమ్స్ ను ఆదిత్య ఆపరేట్ చేసేవాడు. అదే ఆఫీసులో పనిచేసే మరో ఎంప్లాయ్‌తో కలిసి మోసాలకు స్కెచ్ వేశాడు. తన ఫ్రెండ్స్ లక్ష్మీధర్ ముర్ము(21), ప్రమోద్ నాయక్(23), సౌమ్య రంజన్ పట్నాయక్(21), దినేశ్ ఓజా(20) పేర్లతో ఫేక్ బ్యాంక్, మణప్పురం అకౌంట్లను క్రియేట్ చేశాడు. అందరినీ మణప్పురం డోర్ స్టెప్ గోల్డ్ లోన్ అకౌంట్స్ హోల్డర్స్‌గా జనరేట్ చేశాడు. లోన్ల కోసం వారిలో ఇద్దరి పేర్లను ఆన్ లైన్ లో సబ్మిట్ చేశాడు. సిటీలోని హిమాయత్ నగర్ మణప్పురం బ్రాంచ్‌కి ఆదిత్య కాల్ చేశాడు. హెడ్డాఫీసు నుంచి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ ని మాట్లాడుతున్నట్లు చెప్పాడు. డోర్ స్టెప్ గోల్డ్ లోన్ స్కీమ్ లో భాగంగా వెరిఫికేషన్, గోల్డ్ డిపాజిట్ కంప్లీట్ అయ్యిందని , తాము సబ్మిట్ చేసిన రెండు అకౌంట్స్‌కి అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పాడు. ఇలా హిమాయత్‌నగర్ మణప్పురం బ్రాంచ్ నుంచి రూ.30 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. గోల్డ్ డిపాజిట్ కాకపోవడంతో హిమాయత్‌నగర్ బ్రాంచ్ మేనేజర్ అనుమానంతో ఆరా తీశాడు. మోసం జరిగినట్లు తెలుసుకుని గత నెల 24 సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదిత్యతో పాటు అతడికి సహకరించిన నలుగురిని భువనేశ్వర్‌లో అరెస్ట్ చేశారు. మరో ఎంప్లాయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై సోమవారం సిటీకి తరలించామన్నారు.