ఒడిశా రైలు ప్రమాదం.. 288కి చేరిన మృతుల సంఖ్య

ఒడిశా రైలు ప్రమాదం..  288కి చేరిన మృతుల సంఖ్య

ఒడిశా రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య  క్రమక్రమంగా పెరుగుతోంది.  2023 జూన్  03 శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మృతుల సంఖ్య 288కి పెరిగిందని, 747 మంది గాయపడ్డారని, 56 మంది తీవ్రంగా గాయపడ్డారని భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ  తెలిపింది. ఒడిశా ప్రమాద ఘటనతో 58 రైళ్లు రద్దైనట్లుగా  రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. మురో 81 రైళ్లను దారి మళ్లించామని తెలిపారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం : మోడీ 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. సంఘటన స్థలానికి  చేరుకుని పరిశీలించిన ఆయన.. క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోడీ...  రైలు ప్రమాదం తనను తీవ్రంగా  కలిచివేసిందని చెప్పారు.  ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు  ఆదేశించామని,  ప్రమాదానికి కారకులపై కఠిన  చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమన్న మోడీ.. ఈ ఘటనలో  చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

రూ. 10 లక్షలు ఆర్థిక సాయం

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.అటు  రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించింది.