జహీరాబాద్​లో ఇంటి మ్యుటేషన్ ​కోసం లంచం డిమాండ్​ చేసిన ఆఫీసర్​

జహీరాబాద్​లో ఇంటి మ్యుటేషన్ ​కోసం లంచం డిమాండ్​ చేసిన ఆఫీసర్​

తంగళ్లపల్లిలో జూనియర్​ అసిస్టెంట్​

జహీరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ ​కమిషనర్​ సుభాష్ రావు దేశ్​ముఖ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా దొరికాడు. ఏసీబీ డీఎస్​పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు వెంకట్ రాజా గౌడ్, రమేశ్ ​బుధవారం మున్సిపల్ ఆఫీసులో దాడులు నిర్వహించి రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మేనేజర్ మనోహర్, అటెండర్ రాకేశ్​లను కూడా అరెస్ట్ చేశారు. అధికారుల కథనం ప్రకారం.. జహీరాబాద్ కు చెందిన నిస్సార్ తాను కొన్న ఇంటి మ్యుటేషన్​ కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఇంటిపై లిటిగేషన్ ఉందన్న సాకుతో మున్సిపల్ కమిషనర్​తో పాటు మేనేజర్ రూ.3 లక్షలు ఇస్తేనే పని చేస్తామని చెప్పారు. డబ్బులు తగ్గించాలని కోరడంతో రూ.రెండున్నర లక్షలకు ఒప్పుకున్నారు. దీంతో నిస్సార్ ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం రూ.రెండు లక్షలు తీసుకొని మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి డబ్బులు తెచ్చానని మేనేజర్ కు చెప్పాడు. ఆఫీసులో పనిచేస్తున్న అటెండర్ రాకేశ్​కు డబ్బులు ఇవ్వాలని ఆయన సూచించారు. నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు మున్సిపల్ కమిషనర్, మేనేజర్లు అటెండర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. 

డెత్ ​సర్టిఫికెట్​ కోసం లంచం అడిగి...

తంగళ్లపల్లి : డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం డిమాండ్​ చేసిన ఓ జూనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ పట్టుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లికి చెందిన బొంగని అంజయ్య తండ్రి చనిపోగా డెత్ సర్టిఫికెట్ కోసం ఇల్లంతకుంట రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాడు. తహసీల్దార్​ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్  రాజ్ కిషన్ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వారి సూచనల మేరకు ఆఫీసులో బాధితుడి నుంచి రాజ్ కిషన్ రూ.1000 తీసుకుంటుండగా పట్టుకున్నారు.