
హైదరాబాద్ , వెలుగు:కబ్జా అయిన దేవాలయ భూములపై దేవాదాయ శాఖ అధికారులు నజర్ పెట్టింన్రు. పరాధీనమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు జిల్లాల్లో ఈవోలను అపాయింట్ చేసిన్రు. ఆక్రమణకు గురైన భూములు గుర్తించేందుకు వారు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. గుర్తించిన వాటిలో దేవాదాయశాఖ భూములుగా బోర్డులు పెడుతున్రు. భుములు అనుభవిస్తున్న వారు తిరిగి అప్పగించాలని లేకపోతే క్రిమినల్ కేసులు పెడుతమని ఇటీవలే కమిషనర్ అనిల్‌కుమార్ హెచ్చరించారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైన వదిలేది లేదని.. కేసులు, శిక్షల వద్దనుకుంటే భూములు స్వాధీనం చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. లీజుకు తీసుకున్న భూముల విషయంలో కూడా కఠినంగానే వ్యవహరించాలనుకుంటున్రు.
రాష్ట్రంలో దేవాదాయ శాఖకు 87,235.39 ఎకరాలు ఉండగా సుమారు 20,124.08 ఎకరాలు కబ్జా అయినట్లు అధికారులు చెబుతున్రు. అట్లనే భూములను లీజుకు తీసుకొని ప్రభుత్వానికి రాయల్టీని చెల్లించని వారిపై కూడా నజర్‌పెట్టాన్రు. ఎవరి దగ్గర నుంచి ఎంత బకాయిలు వసూలు కావాలన్న దానిపై రిపోర్టులు రెడీ చేస్తున్నరు. వారికి నోటీసులు ఇచ్చి వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నరు.కబ్జాకు గురైన వేల ఎకరాల దేవాదాయ శాఖ భుముల విలువ ఇప్పుడు కోట్లు పలుకుతోంది. 2004కు ముందు వీటి విలువ వేలల్లో, లక్షల్లో ఉండగా ఆ తరువాత వచ్చిన రియల్ బూమ్‌తో ధరలకు రెక్కలొచ్చినయ్. జిల్లాల సంఖ్య పెరగటంతో భూమి విలువ విపరీతంగా పెరిగింది. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.10వేల కోట్ల విలువజేసే దేవాలయ భూములు పరాధీనమైనట్లు ప్రభుత్వ అంచనా. ఇప్పుడు వీటిని స్వాధీనం చేసుకొని బీవోటీ పద్ధతిలోఒ లీజుకిచ్చి అక్కడ కళ్యాణ మండపాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలనుకుంటోంది. వీటిలో వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికి వినియోగించాలని యోచిస్తోంది. అలాగే దేవదాయ శాఖకు చెందిన షాపులు కొంత మంది వ్యక్తులు నామమాత్రపు రేటుకు రెంట్ తీసుకొని, మూడో పార్టీకి ఎక్కువ మొత్తానికి ఇస్తున్నట్లు విచారణలో తేలింది. సికింద్రాబాద్‌లో ఓ ఆలయం షాప్‌లు కొంతమంది రెంట్ తీసుకొని మూడో పార్టీకి ఎక్కువ రేట్‌కు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఒక్కో షాపుకు రూ.600, రూ.1000 రెంట్ చెల్లిస్తూ.. మూడో పార్టీ నుంచి రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. వీటిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదే విధంగా రెంట్లు కూడా పెంచాలనుకుంటున్నరు.
రాజధాని శివారు జిల్లాల్లో ఎక్కువ
కబ్జా అయిన వాటిలో ఎక్కువ శాతం భూములు రాజధానితో పాటు శివారు జిల్లాల్లో ఉన్నట్లు అధికారుల ఎక్వైరీలో తేలింది. నల్గొండ జిల్లాలో 3500 ఎకరాలు, హైదరాబాద్‌లో 2200 ఎకరాలు, హైదరాబాద్ జిల్లాల్లో 1800 ఎకరాలు కబ్జా అయినట్లు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కబ్జా అయ్యాయంటున్నారు. వేల ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్లు అయినట్లు తెలుస్తోంది. వీటిన్నింటిని స్వాధీనం చేయాలని వారికి త్వరలో నోటీసులు పంపనున్నట్లు అధికారులు చెబుతున్నరు.