టెన్త్ విద్యార్థుల అసెస్‌మెంట్ మార్కులపై అధికారుల ఎంక్వైరీ..

టెన్త్ విద్యార్థుల అసెస్‌మెంట్ మార్కులపై అధికారుల ఎంక్వైరీ..
  • మార్కులు కరెక్టుగానే వేసిన్రా?
  • టెన్త్ ఎఫ్ఏ-1 వెరిఫైకి జిల్లాల్లో టీమ్​లు
  • ఇప్పటికే 5 లక్షల మందికిపైగా స్టూడెంట్ల మార్కుల అప్ లోడ్
  • నెలాఖరుకల్లా వెరిఫికేషన్ పూర్తి చేసేలా ప్లాన్

హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు కావడంతో అందరి చూపు ఫార్మెటివ్ అసెస్ మెంట్(ఎఫ్​ఏ)–1 మార్కులపై పడింది. ఈ మార్కుల ఆధారంగానే స్టూడెంట్లకు గ్రేడ్లు కేటాయించే అవకాశం ఉండటంతో, వాటికి ప్రాధాన్యత నెలకొన్నది. అయితే చాలా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా స్టూడెంట్లకు మార్కులు వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మేనేజ్ మెంట్లు స్టూడెంట్లకు మార్కులు కరెక్టుగా వేశారా లేదా అని పరిశీలించేందుకు అధికారులు జిల్లాల్లో వెరిఫికేషన్​ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ తప్పుడు వివరాలు నమోదు చేస్తే.. మేనేజ్ మెంట్లపై చర్యలకు రెడీ అవుతున్నారు.

మార్కుల అప్ లోడ్ కు 26 వరకు గడువు
కరోనా సెకండ్ వేవ్ కారణంగా  మే 17 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. అబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా స్టూడెంట్లకు గ్రేడింగ్ ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. సీబీఎస్ఈ బోర్డు కూడా ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సీబీఎస్ఈ అనుసరించే విధానం కోసం కొద్దిరోజులు వేచిచూసే ధోరణిలో ప్రభుత్వ పరీక్షల విభాగం ఉంది. ఈ క్రమంలోనే ఆల్టర్నెట్ విధానాన్ని కూడా విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఎఫ్ఏ–1 మార్కుల వివరాలనూ సేకరిస్తున్నారు. వీటిని గత గురు, శుక్రవారాల్లోనే అప్​లోడ్ చేయాలని ఆదేశించారు. అయితే ప్రైవేటు మేనేజ్ మెంట్లు గడువు కోరడంతో ఈ నెల 26వరకు ఎఫ్ఏ మార్కులను వెబ్​సైట్​లో అప్​లోడ్ చేయాలని సూచించారు. టెన్త్ స్టూడెంట్లు 5,21,393 మంది ఉండగా... మంగళవారం నాటికి 5 లక్షలకు పైగా స్టూడెంట్ల వివరాలు అందాయని పరీక్షల విభాగం అధికారి ఒకరు చెప్పారు.

తనిఖీలకు టీమ్​లు..
పలు జిల్లాల్లో టెన్త్ ఎఫ్ఏ –1 మార్కుల అప్ లోడ్ పై విమర్శలు వస్తుండటంతో, మేనేజ్ మెంట్లు ఎలా వేశారో తెలుసుకునేందుకు పరీక్షల విభాగం రెడీ అయింది. దీనికోసం పరీక్షల విభాగం అధికారుల సూచనల మేరకు ఎంఈఓల పర్యవేక్షణలో ఓ సీనియర్ హెడ్మాస్టర్​తోపాటు లాంగ్వేజీ టీచర్, మరో నాన్ లాంగ్వేజీ సబ్జెక్టు టీచర్​తో కూడిన టీమ్​లను జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏటా ఈ ప్రక్రియ ఉంటున్నా..  ఈ ఏడాది ఎఫ్ఏ–1​ మార్కులే కీలకంగా మారడంతో, వాటికి ప్రాధాన్యత నెలకొన్నది. ఇప్పటికే చాలా స్కూళ్ల స్టూడెంట్ల వివరాలను మేనేజ్ మెంట్లు వెబ్ సైట్ లో అప్​లోడ్ చేశాయి. ఆయా స్కూళ్లలో తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వెబ్ సైట్​లో అప్​లోడ్ చేసిన వివరాలను, మార్కుల రికార్డులను, హార్డ్ కాపీలను వెరిఫికేషన్ టీమ్ లు పరిశీలించనున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు యోచిస్తున్నారు.