
- బొగ్గు గనులపై కొనసాగుతున్న ఆఫీసర్ల నిరసనలు
- కోలిండియాలో చెల్లించినా ఇక్కడ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం
- అసెంబ్లీలో ప్రస్తావించిన రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఫ్రీ కరెంట్, ఐఐటీ, ఐఐఎం ఫీజు రీయింబర్స్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్
- ఆఫీసర్ల ఆందోళనకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల మద్దతు
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న ఆఫీసర్లలో పీఆర్పీ చిచ్చు రేపుతోంది. కంపెనీలో పని చేస్తున్న ఎన్సీడబ్ల్యూఏ వర్కర్స్కు లాభాల బోనస్ చెల్లిస్తున్న మాదిరిగానే ఆఫీసర్లకు ఫర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే(పీఆర్పీ) పేర బోనస్ చెల్లించడంలో మేనేజ్మెంట్ ఏండ్లుగా జాప్యం చేస్తోంది. 2022–-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ పీఆర్పీ,ఇతర సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి 2,500 మంది ఆఫీసర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ,ఐఎన్టీయూసీ మద్దతు ప్రకటించాయి.
పీఆర్పీల కోసం ఎదురుచూపులు..
కోలిండియా పరిధిలోని 9 బొగ్గు పరిశ్రమల్లో సింగరేణి ఒకటి. బొగ్గు ఉత్పాదక సంస్థల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం ఫర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే(పీఆర్పీ) చెల్లిస్తారు. కానీ, సింగరేణిలో ఏండ్లు గడుస్తున్నా ఆఫీసర్లకు పీఆర్పీ అందడం లేదు. ఈక్రమంలో 2022–-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఆర్పీ చెల్లించాలని సింగరేణి వ్యాప్తంగా 2,500 మంది ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. కోలిండియా పరిధిలోని బొగ్గు పరిశ్రమల ఆఫీసర్లకు పీఆర్పీలను గత ఏడాది జూన్ 23న చెల్లించారు.2023–-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఆర్పీని కూడా ఈ ఏడాది జూన్ 25న కోలిండియా చెల్లించింది. కోలిండియాలో అమలయ్యే ప్రతి ఒప్పందాన్ని సింగరేణి కంపెనీలోనూ తప్పనిసరిగా వర్తింపజేయాలి.
పీఆర్పీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి,రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీలకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. పీఆర్పీ చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదంటున్నారు. 2007–-08 నుంచి 2013–14 వరకు పెండింగ్ పీఆర్పీని వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఏడాది దాటినా యాజమాన్యం కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో, కొందరు రిటైర్డు ఆఫీసర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు.
రూ.120 కోట్లకు పైగా పెండింగ్..
2022–-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఆర్పీ సగటున ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల చొప్పున రూ.120 కోట్ల వరకు రావాల్సి ఉందని అంటున్నారు. ఇందులో ఐటీ పోను రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు పీఆర్పీ వస్తుందని చెబుతున్నారు.
ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్..
సింగరేణిలో పని చేస్తున్న 40 వేల మంది ఎన్సీడబ్ల్యుఏ ఉద్యోగులకు యాజమాన్యం ఒక శాతం ఫ్రీ కరెంట్ వర్తింపజేస్తుంది. ఐఐటీ, ఐఐఎం ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రయోజనాలు కల్పిస్తోంది. కార్మికుల మాదిరిగానే తమకు కూడా ఫ్రీ కరెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలని ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ విషయంలో పారదర్శకత కొరవడుతోందని, ఏండ్ల తరబడి ఒకే గ్రేడ్‌లో పని చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అసెంబ్లీలో ప్రస్తావించిన వివేక్ వెంకటస్వామి
సింగరేణి ఆఫీసర్లకు న్యాయంగా రావాల్సిన పీఆర్పీ వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో ప్రస్తావించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
హామీలతో సరిపెడుతున్న యాజమాన్యం..
పీఆర్పీతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం జూన్‌లో సింగరేణి ఆఫీసర్లు పోరుబాట పట్టారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంల ద్వారా సింగరేణి సీఎండీకి వినతిపత్రాలు అందించారు. జులైలో పీఆర్పీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో జూన్ 24న నిర్వహించాల్సిన బ్లాక్ బ్యాడ్జ్ నిరసనను ఆఫీసర్లు వాయిదా వేసుకున్నారు. ఆగస్టు వచ్చినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఈ నెల12 నుంచి ఆఫీసర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు కొనసాగిస్తున్నారు.
17న భూపాలపల్లిలో జరిగిన కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి కాలరీస్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించారు. ఈక్రమంలో సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు ఈ నెల చివరి లోగా పీఆర్పీ చెల్లింపు, ఇతర డిమాండ్లు పరిష్కరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. అయితే తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని, సెప్టెంబర్ 1 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆఫీసర్లు స్పష్టం చేశారు.