సిద్దిపేట జిల్లా పరిధిలో హైవే నిర్మాణానికి భూసేకరణ

సిద్దిపేట జిల్లా పరిధిలో హైవే నిర్మాణానికి భూసేకరణ

సిద్దిపేట, వెలుగు :  ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే (765 డీజీ) నిర్మాణానికి సిద్దిపేట జిల్లా పరిధిలో భూమిని సేకరించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. హన్మకొండ, సిద్దిపేట, మెదక్  జిల్లాల గుండా 137.6 కిలో మీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించారు. దీనికి రూ.1461  కోట్లు కేటాయించారు. ఇందులో ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు 63.6 కిలో మీటర్ల ప్యాకేజీకి రూ.882.18, సిద్దిపేట నుంచి మెదక్  74 కిలోమీటర్ల రెండో ప్యాకేజీకి రూ.578.82 కోట్లు కేటాయించారు.  సిద్దిపేట జిల్లాలో ఈ నేషనల్​హైవే దాదాపు 80 కిలో మీటర్ల మేర సాగుతోంది. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు నిర్మాణం చేసే రోడ్డుకు సంబంధించి మిట్టపల్లి, ముండ్రాయి, పాలమాకుల, బద్దిపడగ, బస్వాపూర్, సముద్రాల, పందిల్ల, హుస్నాబాద్, పోతారం(ఎస్), జిల్లెల్ల గడ్డ ల్లో భూ సేకరణ జరపనున్నారు. సిద్దిపేట జిల్లాలో దాదాపు 160 మంది రైతుల నుంచి 20 ఎకరాల భూమిని  రోడ్డు విస్తరణ కోసం సేకరించనున్నారు. ఇప్పటికే భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి అభ్యంతరాలను ఆహ్వానించారు. దీనిపై ఈనెల 19న హుస్నాబాద్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు  హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలిపారు.

పందిల్ల వద్ద టోల్ ప్లాజా
ఈ హైవేలో హుస్నాబాద్ మండలం పందిల్ల వద్ద ఎనిమిది లైన్ల టోల్ ప్లాజా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఇక్కడ ఎక్కువ విస్తీర్ణంలో భూమిని సేకరించనున్నారు. ఈ రోడ్డు  విస్తరణకు మొత్తంగా కూడా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోనే ఎక్కువ భూమిని సేకరించాల్సి ఉంది.   హుస్నాబాద్ డివిజన్ లో దాదాపు 18 ఎకరాల భూమిని సేకరిస్తుంటే సిద్దిపేట డివిజన్ లో కేవలం రెండు ఎకరాల్లోనే సేకరిస్తుండటం గమనార్హం. కాగా, ఈ రోడ్డును వంద ఫీట్లతో విస్తరించనున్నారు. మొదట హుస్నాబాద్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మించాలని ఆలోచన చేసినా భూసేకరణ జరపాల్సి రావడంతో అధికారులు దీన్ని విరమించుకున్నారు.

పలుచోట్ల హై లెవల్​ బ్రిడ్జీల నిర్మాణం..
బస్వాపూర్, పందిళ్ల వద్ద పాత బ్రిడ్జీల స్థానంలో హై లెవల్ బ్రిడ్జీలు నిర్మించనున్నారు. ఇవే కాకుండా 26 మైనర్ బ్రిడ్జీలు,  29 పైప్ కల్వర్టులు, రెండు బాక్స్ కల్వర్టులు పునర్​నిర్మించడంతో పాటు ఒక మైనర్ బ్రిడ్జి, మేజర్ బ్రిడ్జి , రెండు పైప్ లైన్ కల్వర్టులు, 11 బాక్స్ కల్వర్టులను కొత్తగా నిర్మించి 15 పైప్ లైన్ కల్వర్టులను విస్తరించనున్నారు. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు హై వే నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుతుండటంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. 

అన్నీ విలువైన భూములే.. 
ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే నిర్మాణానికి రైతుల నుంచి సేకరిస్తున్న అన్నీ భూములు విలువైనవే ఉన్నాయి. రోడ్డుకు ఇరువైపులా భూముల విలువ ప్రస్తుతం మార్కెట్​లో రూ.కోట్లు పలుకుతోంది. కానీ రోడ్డు విస్తరణలో పోతున్న భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల ప్రాతిపదికనే పరిహారం చెల్లించనుంది. దీంతో తాము కోల్పుతున్న భూమి విలువకు తగిన పరిహారం ఇవ్వడంలేదనే అసంతృప్తిలో బాధిత రైతులు ఉన్నారు.