- రేపు పాలేరు రిజర్వాయర్లో ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి
- ఖమ్మం జిల్లాలో 864 చెరువుల్లో 1.75 కోట్ల పిల్లలను వదలాలని నిర్ణయం
- తొలుత నీళ్లు లేక, తర్వాత వరదలతో టెండర్ ప్రక్రియలో జాప్యం
- గతంలో చేప పిల్లల లెక్కల్లో అవకతవకలు
- ఈసారైనా నాణ్యత, లెక్కలపై దృష్టిసారించాలని మత్స్యకారుల విజ్ఞప్తి
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. మంగళవారం పాలేరు రిజర్వాయర్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు, రిజర్వాయర్లలో పిల్లలను వదలనున్నారు. వాస్తవానికి రెండు నెలలకు ముందే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, అప్పట్లో చెరువుల్లో నీళ్లు లేకపోవడం, ఆ తర్వాత వరదల లాంటి కారణాలతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆలస్యమైంది.
ఇటీవల టెండర్లు ఫైనల్ కాగా ఖమ్మం జిల్లాలోని 864 చెరువుల్లో 1.75 కోట్ల పిల్లలను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారులకు లబ్ధిచేకూరేలా ఈ పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2.20 కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో చేప పిల్లల లెక్క, తూకం విషయంలో జరిగిన మోసాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈసారి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
లెక్కల్లో కాంట్రాక్టర్ల మాయ!
చేప పిల్లలను సప్లయ్ చేసేందుకు టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు, చేప పిల్లల లెక్కల్లో మాయ చేస్తున్నారు. కోట్లాది పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకుంటూ, తక్కువ సంఖ్యలో పిల్లలను చెరువుల్లో వదిలి అటు మత్స్యకారులను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.
గతంలో అప్పటి కలెక్టర్ వీపీ గౌతమ్ స్వయంగా రఘునాథపాలెం మండలంలో చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్న సమయంలో లెక్కచూడగా, తక్కువ సంఖ్యలో పిల్లలను తెచ్చినట్టు గుర్తించారు. దీంతో మోసాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కలెక్టర్, కాంట్రాక్టర్ పై చర్యలకు ఆదేశించారు. మరోవైపు పిల్లల సైజ్ విషయంలోనూ కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడుతుండడం, నాణ్యతలేని పిల్లలను సప్లయ్ చేయడం వల్ల సరైన దిగుబడి, చేపల ఎదుగుదల లేక మత్స్యకారులు నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 210 మత్స్యకార సంఘాలుండగా, ఇందులో 16,500 మంది సొసైటీ సభ్యులున్నారు. ఈసారైనా నాణ్యత, లెక్కలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మత్స్యకారులు కోరుతున్నారు. లెక్కల్లో మోసాలు జరగకుండా ప్రతి చెరువు దగ్గర అధికారులు, మత్సకారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, పంపిణీ సమయంలో ఆ కమిటీ బాధ్యత తీసుకుంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
మోసం చేస్తే చర్యలు
ప్రభుత్వం నుంచి టెండర్లు దక్కించుకున్న మేరకు కాంట్రాక్టర్లు చేప పిల్లలను సప్లయ్ చేయాలి. ఈసారి పిల్లల పంపిణీ ఆలస్యమైనందున 1.75 కోట్ల పిల్లల్లో 1.15 కోట్ల పిల్లల వరకు పెద్ద సైజు పిల్లలను వదులుతున్నాం. మరో 60 లక్షల చిన్న పిల్లలను అన్ని చెరువుల్లో కలిపి వదులుతాం. సప్లయర్లు నీటి డ్రమ్ముల్లో పిల్లలను తీసుకుని వచ్చి, చెరువుల దగ్గరే మత్స్యకార కమిటీ సమక్షంలో కౌంట్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి నీటిలో వదులుతారు. దీనివల్ల లెక్కతప్పకుండా ఉంటుంది. అయినా ఏదైనా మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. - శివ ప్రసాద్, జిల్లా ఇన్చార్జి మత్స్యశాఖ అధికారి, ఖమ్మం