ఎలివేటెడ్ కారిడార్ పనులపై..సర్కార్​ ఫోకస్​

ఎలివేటెడ్ కారిడార్ పనులపై..సర్కార్​ ఫోకస్​
  • భూ సేకరణను త్వరగా పూర్తిచేయాలని హెచ్ఎండీఏ, కంటోన్మెంట్ అధికారుల నిర్ణయం
  • పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం 
  • భూముల అప్పగింత, ప్రణాళికలపై చర్చ

హైదరాబాద్, వెలుగు : ఎలివేటెడ్ కారిడార్ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం హెచ్​ఎండీఏ ఆఫీస్​లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్ (ఎంఏయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ దాన కిశోర్, జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి, కంటోన్మెంట్ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.

కొన్ని రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ పనుల పురోగతికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కంటోన్మెంట్, హెచ్ఎండీఏ అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్ రోడ్ వరకు, జేబీఎస్ నుంచి శామీర్​పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్​లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇటు నేషనల్ హైవే 44లో ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్

నాగ్​పూర్ వెళ్లే రూట్​లో ట్రాఫిక్ సమస్య ఉండదు. అలాగే, జేబీఎస్ నుంచి శామీర్​పేట ఓఆర్ఆర్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్​తో ఆయా ప్రాంతాల్లో ఇప్పుడున్న ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. 

73 ఎకరాలు సేకరించాలి

ఈ ప్రాజెక్ట్​లో భాగంగా కంటోన్మెంట్ పరిధిలోని పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరించాల్సి ఉంటుంది. దీనికి ఇటీవల కేంద్ర రక్షణ శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. మొత్తం 73 ఎకరాలు సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో 55.85 ఎకరాలు కంటోన్మెంట్ పరిధిలో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ టన్నెల్ కోసం 8.90 ఎకరాలు, మరో 8.41 ఎకరాలు ప్రైవేటుగా సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

రూ.1,580 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారిడార్ పూర్తి కావాలంటే హెచ్​ఎండీఏ, కంటోన్మెంట్​తో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంగా ముందుకెళ్లాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా కంటోన్మెంట్ నుంచి సేకరించే భూములకు ప్రత్యామ్నాయంగా డబ్బులు చెల్లించాలా? లేకపోతే వేరే చోట భూములు ఇవ్వాలా? భూములే అంటే.. ఎక్కడ ఇవ్వాలి? అన్న అంశాలపై అధికారుల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.