- ప్రమాద ఘంటికలు
- సిరికొండ మండలం పాకాలలో 50 మీటర్ల అడుగుకు
- భీంగల్ మండలం గొనుగొప్పుల విలేజ్‌లో 42 మీటర్ల లోతున నీరు
- సగటున 20 మీటర్ల పైనే గ్రౌండ్ వాటర్
- మండుతున్న ఎండలతో డేంజర్ బెల్స్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో రోజు రోజుకు అడుగుంటుతున్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో గ్రౌండ్ వాటర్ గణనీయంగా పడిపోవడం ఆఫీసర్లను టెన్షన్ పెడుతోంది. గరిష్ఠంగా 50 అడుగుల లోతుకు నీరు వెళ్లిపోవడంతో యాసంగి పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేగంగా నీరు అడుగంటిపోతున్న 15 మండలాల పట్ల అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంచినీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా ఆఫీసర్లతో సమన్వయం చేసుకోడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శరత్‌ను బుధవారం గవర్నమెంట్ అపాయింట్ చేసింది.
రెండు నెలల్లో రెండితలకు
జిల్లాల్లో 5.20 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతుంది. వరి పంట 3.70 లక్షల ఎకరాల్లో ఉంది. అఫీషియల్‌గా అగ్రికల్చర్ బోర్ కరెంట్ కనెక్షన్లు 1.80 లక్షలు కాగా అనధికారంగా మరో 25 వేలు కలిపి 2.05 కనెక్షన్లు ఉంటాయి. ఇప్పటికీ వరి కోతలు 60 శాతం ముగియగా మరో 40 శాతం పంట కోతలు ఈ నెలాఖరు దాకా వెళ్తాయి. పంటల కోసం విరామం లేకుండా బోర్లు నడపడంతో పాటు ఎండల తీవ్రత భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. సిరికొండలోని పాకాల విలేజ్‌లో డిసెంబర్ నెలలో 9.88 మీటర్ల లోతున ఉన్న నీరు జనవరికి 19.56 మీటర్ల లోతుకు వెళ్లి ఇప్పుడు 50 మీటర్ల లోతుకు చేరాయి. భీంగల్ మండలం గొనుగొప్పుల గ్రామంలో ప్రస్తుతం 42 మీటర్ల అడుగుకు గ్రౌండ్ వాటర్ చేరింది. చీమన్‌పల్లి, గడ్కోల్, తూంపల్లి, తాళ్లపల్లి, ముషీర్‌నగర్, రామన్నపేట,చిన్న వాల్గోట్, ఎడపల్లి, మోపాల్, ముప్కాల్, నందిపేట వెల్మల్, మాక్లూర్ మదన్‌పల్లి, మెండోరా, నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, రెంజల్ దూపల్లి, దండిగుట్టలో వేగంగా గ్రౌండ్ వాటర్ పడిపోతున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. చాలా వరకు అక్కడ గ్రౌండ్ వాటర్ 30 మీటర్ల లోతుకు వెళ్లినట్లు నిర్దారించారు. జిల్లాలో 15 కు మించి మండలాల్లో భూగర్భనీటి మట్టం సగటున 20 మీటర్లకు చేరి ఆందోళన కలిగిస్తోంది.
ఏప్రిల్, మే నెలలు మరింతగా
ఈ రెండు నెలలు ఎండలు మరింత దంచికొట్టనున్నాయి. గ్రౌండ్ వాటర్ మరింత పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇంకా 40 శాతమున్న వరి పంటలకు ఇప్పుడున్న బోర్లు నీటిని అందివ్వలేకపోతున్నాయి. దీంతో కొత్త బోర్లు వేసి పంటలను ఎలాగైనా కాపాడుకోవాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. వాల్టా ఉల్లంఘనతో కొత్త బోర్ల తవ్వకానికి వీలులేకుండా చూడాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ తహసీల్దార్‌కు ఆర్డర్స్ జారీ చేశారు.
తాగునీటిపై హై ఫోకస్
ప్రతి వేసవి కాలంలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం తలెత్తే గ్రామాలు గుర్తించి ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్లు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారు. ఈసారి గ్రౌండ్ వాటర్ ఆందోళనకరంగా మారినందన ప్రత్యేక చర్యలు రూపొందించారు. పంట కోతలు ముగిసి ఖాళీగా ఉన్న సమీప బోర్లను అద్దెకు తీసుకోవడం, నీటి ట్యాంకులతో సరఫరాకు ప్లాన్ సిద్ధం చేశారు. జిల్లా ఆఫీసర్లతో కో ఆర్డినేషన్ కోసం స్టేట్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ డాక్టర్ శరత్‌ను నియమించారు.