జగిత్యాల జిల్లాలో రేపు మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో అధికారులు రోడ్డు పనులను మరమ్మతు చేపట్టారు. ధర్మపురి ఆలయంలో మంత్రి హరీష్ రేపు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ధర్మపురి నుండి ధర్మారం వరకు అధికార పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయనున్నారు. అయితే ఈ మార్గం గుండా రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో అధికారులు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు.
అయితే గతంలో ఇదే రోడ్డుపై గుంతల కారణంగా సుమారు పదిమంది వరకు యాక్సిడెంట్ లో ప్రాణాలను కోల్పోయారు. రోడ్ల గుంతల పూడ్చాడంటూ స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడుమంత్రి వచ్చి బైక్ ర్యాలీ చేస్తారని ఆయన మెప్పు పొందేందుకు హడావిడిగా రోడ్ల గుంతలను పూడుస్తున్నారని స్థానికులు అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.