టార్గెట్​.. బెగ్గర్స్​ ఫ్రీ సిటీ .. అధికారుల స్పెషల్ ఆపరేషన్స్ 

 టార్గెట్​.. బెగ్గర్స్​ ఫ్రీ సిటీ .. అధికారుల స్పెషల్ ఆపరేషన్స్ 
  •  ట్రాఫిక్ సిగ్నల్స్, టెంపుల్స్ హాట్ స్పాట్స్​గా గుర్తింపు  
  • పోలీస్, లేబర్, రెవెన్యూ శాఖల సమన్వయంతో రెస్క్యూ
  • పట్టుకున్న 156 మందిలో ఎక్కువగా పిల్లలే ఉన్నారు 
  • మళ్లీ బెగ్గింగ్ వృత్తిలోకి రావొద్దని ఆఫీసర్లు కౌన్సిలింగ్​
  • కర్ణాటక, మహారాష్ట్ర వారిని సొంతూళ్లకు తరలింపు 

హైదరాబాద్​, వెలుగు : బెగ్గర్స్​ ఫ్రీ సిటీ కోసం అధికారులు స్పెషల్ ​ఆపరేషన్స్​ చేపట్టారు. ఆపరేషన్​స్మైల్​తో పాటు, జిల్లా అధికారులు కూడా స్పెషల్​ ఆపరేషన్స్​ నిర్వహిస్తున్నారు.  ముందుగా బెగ్గర్స్ ఎక్కువగా కనిపించే ట్రాఫిక్ సిగ్నల్స్, టెంపుల్స్, ఇతర ప్రాంతాలను హాట్ స్పాట్స్​గా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని వారిని రెస్క్యూ చేసి​హోమ్స్ కు తరలిస్తున్నారు. వీరిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు ఉన్నారు. ఆయా రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వారిని సొంత ప్రాంతాలకు పంపిస్తున్నారు. బెగ్గింగ్​చేస్తున్న పెద్దలు, పిల్లల చేత బెగ్గింగ్​చేయిస్తున్న తల్లిదండ్రులు, సంరక్షకులకు అధికారులు కౌన్సిలింగ్​ఇస్తున్నారు. మంచి భవిష్యత్​ఉన్న పిల్లల్ని బెగ్గింగ్​కూపంలోకి నెట్టొద్దని, వారిని మంచిగా చదివించాలని సూచిస్తున్నారు.

హాట్​స్పాట్​ ప్రాంతాల్లో రెస్క్యూ 

ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీగా ఉండే టెంపుల్స్ వద్ద బెగ్గర్స్​ఎక్కువగా కనిపిస్తారు. దీంతో ఆయా ప్రాంతాలను బెగ్గర్స్​హాట్​స్పాట్​గా అధికారులు గుర్తించారు. హైదరాబాద్​కలెక్టర్​అనుదీప్​ఆదేశాలతో గత నెల 19 నుంచి 24 వరకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీస్​, లేబర్, రెవెన్యూ డిపార్ట్​మెంట్స్ కో ఆర్డినేషన్ తో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. భిక్షాటన చేస్తున్న పిల్లలు, వారి తల్లులను మొత్తం 156 మందిని రెస్క్యూ చేశారు.

బాలల పరిరక్షణ సంక్షేమ సమితి ఎదుట హాజరు పరిచి, వారి ఆదేశాల మేరకు ఎక్వైరీలు చేసి, రిపోర్టు తయారు చేశారు. వీరిలో కొందరు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా..  తెలంగాణలో వికారాబాద్​ జిల్లా నుంచి ముగ్గురు పిల్లలు, ఇద్దరు పెద్దలు, రంగారెడ్డి జిల్లా నుంచి 13 మంది పిల్లలు, 11 మంది పెద్దలు ఉన్నారు. హైదరాబాద్​జిల్లాలో ఎక్కువగా 68 మంది పిల్లలు, 36 మంది తల్లి, సంరక్షకులకు రెస్క్యూ చేశారు. మరో 9 మంది పిల్లలను సీసీఎస్​లో, 17 మంది పిల్లలను జువైనల్ హోమ్​కు తరలించారు. 

ప్రత్యేక బస్సుల్లో సొంతూళ్లకు తరలింపు 

సిటీలో స్థానిక బెగ్గర్స్​కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువ ఉన్నారు. స్పెషల్ డ్రైవ్​లో భాగంగా ఇతరరాష్ట్రాలకు చెందిన మొత్తం 64 మందిని రెస్క్యూ చేశారు. వీరిలో కర్ణాటకకు చెందిన 29 మంది పిల్లలు, 10 మంది తల్లి, సంరక్షకులు, మహారాష్ట్రకు చెందిన 19 మంది పిల్లలు, ఆరుగురు తల్లి, సంరక్షకులను హోమ్స్​కు తరలించారు. అనంతరం కర్ణాటక బెగ్గర్స్​ను ఈనెల11న ప్రత్యేక బస్సుల్లో సొంతూళ్లకు పంపించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందినవారిని మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ సమక్షంలో ప్రత్యేక బస్సుల్లో  సొంతూళ్లకు తరలించారు. వీరి మళ్లీ బెగ్గింగ్ వృత్తిలోకి రాకుండా కౌన్సిలింగ్ ​ఇచ్చి పంపించినట్టు అధికారులు తెలిపారు. 

చదువుతోనే మంచి భవిష్యత్​ : హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్​ 

పిల్లలతో బెగ్గింగ్ చేయించకుండా బాగా చదివించాలని, తద్వారా సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని హైదరాబాద్​కలెక్టర్​అనుదీప్ సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతో పాటు పిల్లలకు మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలిపారు. మంగళవారం కాచిగూడ నింబోలి అడ్డలోని జునైనల్ గర్ల్స్ హోమ్ వద్ద ప్రత్యేక బస్సులో మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన బెగ్గర్స్​ను సొంతూళ్లకు పంపే బస్సుకు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.

పిల్లలు బాగా చదువుకుంటే డాక్టర్లు, ఇంజనీర్లు న్యాయవాదులు కావొచ్చని, మంచి చదువుతోనే జాబ్ లు దొరుకుతాయని, తద్వారా కుటుంబ భవిష్యత్ బాగుంటుందని పేర్కొన్నారు. అనంతరం జునైనల్ హోమ్ లో అన్ని గదులను పరిశీలించి అక్కడ చదువుతున్న బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, బాలికల హోమ్ సూపరింటెండెంట్ కృష్ణవేణి, బాలరక్ష భవన్ అధికారి సుమలత, జిల్లా బాలల పరిరక్షణ విభాగ యంత్రాంగం, పోలీస్,  జునైనల్ గర్ల్స్ హోమ్ సిబ్బంది పాల్గొన్నారు.