వరంగల్ లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలపై అధికారుల ఫోకస్..

వరంగల్ లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలపై అధికారుల ఫోకస్..
  • వరంగల్ లో వరద ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాల పరిశీలన
  • భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన

  వరంగల్‍, పర్వతగిరి, వర్ధన్నపేట, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ సిటీలో రెండ్రోజులుగా దంచికొట్టిన వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బుధవారం  లీడర్లు, ఆఫీసర్లు కాలనీల బాట పట్టారు.  మంత్రి కొండా సురేఖ అధికారులను అప్రమత్తం చేశారు. వరద రావడానికి గల కారణాలపై రిపోర్టు ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎమ్మెల్యేలు కేఆర్‍. నాగరాజు, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారదా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ ఉదయం నుంచి రాత్రి వరకు లోతట్టు ప్రాంతాల్లో కలియతిరుగుతూ.. బాధితులకు భరోసా ఇచ్చారు.

భద్రకాళి బండ్‍ వెనక భాగంలో 2018లో నిర్మించిన రిటైనింగ్‍ వాల్‍ వద్ద నీటి ప్రవాహం తీరును పరిశీలించారు. పోతన్‍ రోడ్‍ మర్వాడి భవన్‍లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. లోతట్టు కాలనీ బాధితులకు అందిస్తున్న భోజన వసతులు, సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సహయక చర్యల కోసం 87901 89289, 89822 88088 నంబర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.  పర్వతగిరి మండలం వడ్లకొండలోని ఊర చెరువును వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్‍ సత్యశారద పరిశీలించారు. కట్ట తెగితే 3 గ్రామాలకు ముంపు సమస్య రానున్నట్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా  ఇన్‌చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు.  బుధవారం మహబూబాబాద్-– మరిపెడ ప్రధాన రోడ్డులోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి, బైపాస్ రోడ్డును పరిశీలించారు. కంట్రోల్ రూమ్ నంబరు79950  74803ను  సంప్రదించాలని ఆయన సూచించారు.  మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌ నాథ్  కేకన్ పాకాల వాగు బ్రిడ్జి వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు.