
- నీటి వనరుల లెక్క తేల్చేందుకు అధికారుల శ్రీకారం
- ఐదేండ్ల తర్వాత చిన్న నీటి వనరులపై సర్వే
- క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్వే చేసి ఆన్లైన్లో నమోదు
- ఎన్యుమరేటర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి.. ప్రత్యేక యాప్ కేటాయింపు
ఆదిలాబాద్, వెలుగు: సాగునీటి రంగంలో చిన్న నీటి వనరుల లెక్క తేల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 7వ చిన్న నీటి వనరుల గణనకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఐదేండ్లకోసారి చిన్న నీటి వనరులను లెక్కించి తద్వారా అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. చివరిసారిగా 2019లో ఈ సర్వే జరిగింది. ఆ తర్వాత 2024లో చేపట్టాల్సిన సర్వే భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది-----ఆగస్టు 30లోగా సర్వే పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది.
దీంతో సెప్టెంబర్ చివరిలోగా సర్వే స్టార్ట్ చేసి అక్టోబర్ 30 వరకు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి సాంకేతికతను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని సర్వే చేప్టటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయా జిల్లాలో మండల, డివిజినల్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు శిక్షణ ఇచ్చారు. సర్వే కోసం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రణాళిక శాఖలో గతంలో పనిచేసిన కంప్యూటర్ సూపర్వైజర్లను ఎన్యూమరేటర్లుగా నియమించారు.
సర్వే ఆధారంగా ప్రత్యేక ప్రణాలిక
చిన్న నీటి వనరులను గుర్తించడం, నీటి లభ్యతను అంచనా వేసి వనరుల అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రత్యేక ప్రణాళిక రూపొందించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. అలాగే భూగర్భజలాల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అనంతరం పూర్తి వివరాలు సేకరించి వనరుల అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం కేటాయిస్తుంది. గతంలో ఈ ప్రక్రియను మ్యానువల్‌గా చేపట్టేవారు. నిర్ణీత ప్రొఫార్మాతో కూడిన మాడ్యూల్స్‌ను సిబ్బందికి అందజేస్తే.. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను అందులో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచేవారు. తాజాగా మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయనున్నారు. గ్రామాల వారీగా వనరులను గుర్తించి జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఈ వివరాలను నమోదు చేసేందుకు కేంద్రం ‘ఎంఐ సెన్సెస్’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
ఏవేవి గుర్తిస్తారంటే..?
బోరు బావులు, బావులు, నీటి కుంటలు, వాగులు, చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, చెక్ డ్యాంలు వంటి చిన్ననీటి వనరులన్నింటినీ ఈ సర్వేలో గుర్తించనున్నారు. వీటితోపాటు ఈసారి సౌర విద్యుత్, తుంపర్ల సేద్యం, నీటి లభ్యత, నిల్వ సామర్థ్యం, సాగునీటి వినియోగం, ఆయకట్టు, విద్యుత్ వినియోగం, సాగవుతున్న పంటల వివరాలను కూడా సేకరించనున్నారు. సర్వే కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రణాళిక శాఖ సిబ్బందిని ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాలను కేటాయించారు. ఈ ప్రక్రియను మండల స్థాయిలో మండల స్టాటిస్టికల్ ఆఫీసర్, డివిజన్ స్థాయిలో డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు పర్యవేక్షించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో గత సర్వేలో చిన్న నీటి వనరుల లెక్కలు
జిల్లా చెరువులు బోరుబావులు బావులు
ఆదిలాబాద్ 464 23,161 34,758
మంచిర్యాల 840 11,014 9,344
నిర్మల్ 511 23,168 6,163
ఆసిఫాబాద్ 501 23,161 7,615