ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్​

ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్​
  • కోర్టు ఆదేశాలతో లాక్ 
  • పగలగొట్టి తెరిచిన ఆఫీసర్లు 
  • కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని 26న కోర్టుకు అందజేయనున్న అధికారులు
  • అనేక మలుపుల మధ్య నాలుగున్నరేండ్లకు గది తెరిచారు
  • నాలుగు పెట్టెలకు తప్ప మిగతా వాటికి తాళాలు లేవు: కాంగ్రెస్​ అభ్యర్థి లక్ష్మణ్​
  • కోర్టు ఆదేశాలతో తాళం పగులగొట్టిన ఆఫీసర్లు

జగిత్యాల, వెలుగు: జగిత్యాలలో స్ట్రాంగ్ రూమ్ తాళాల మిస్సింగ్ ఎపిసోడ్ కు తెరపడింది. కోర్టు ఆదేశాలతో ఆఫీసర్లు తాళాలు పగులగొట్టి రూంను ఓపెన్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్  కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా నూకపల్లిలో వీఆర్ కే కాలేజీలోని  స్ట్రాంగ్ రూమ్​ను ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు లాక్ పగలగొట్టి ఓపెన్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, సీసీటీవీ ఫుటేజీలకు చెందిన జిరాక్స్ లను అటెస్ట్ చేసి వాటిని ఈ నెల 26న అధికారులు కోర్టుకు అందజేయనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10న స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసి 17ఏ, 17సీ డాక్యుమెంట్లు, సీసీటీవీ ఫుటేజీలు, సంబంధిత డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉండగా, స్ట్రాంగ్ రూం నంబర్ 786051 నంబర్ తాళాలు మిస్ అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. సుమారు ఐదు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో తాళాన్ని బ్రేక్  చేయాలని ఆఫీసర్లు నిర్ణయించగా, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్  అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎలక్షన్  కమిషన్  ఆఫ్  ఇండియా (ఈసీఐ) ఢిల్లీ నుంచి త్రీమెన్  కమిటీ సభ్యులు ప్రిన్సిపల్  సెక్రటరీ వికాస్ రాజ్, అండర్  సెక్రటరీ సంజయ్  కుమార్, జాయింట్ సెక్రటరీలను సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన త్రీమెన్  కమిటీ సభ్యులు ఈ నెల 17న కొండగట్టులోని జేఎన్టీయూలో గతంలో కలెక్టర్లుగా పనిచేసిన శరత్, రవితో పాటు అడిషనల్ కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ, ధర్మపురి ఎలక్షన్  రిటర్నింగ్  ఆఫీసర్  భిక్షపతిలను ఎంక్వయిరీ చేశారు. ఆ ఎంక్వయిరీకి సంబంధించిన వివరాలను వారు కోర్టుకు నివేదించారు. దీంతో ఈ నెల 23న ధర్మపురి స్ట్రాంగ్ రూం లాక్   పగలగొట్టాలని లేదా టెక్నీషియన్ తో తీయాలని, ప్రతి ఘటనను కెమెరాలో రికార్డు చేయాలని కోర్టు సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 26న కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అయితే, ఈ కేసు  రెండున్నరేళ్ల పాటు పెండింగ్ లో ఉండగా, ధర్మపురి ఎలక్షన్  రిటర్నింగ్  ఆఫీసర్  భిక్షపతి కోర్టుకు హాజరుకాకపోవడం.. అరెస్ట్  వారంట్  రావడంతో మళ్లీ కొంత పురోగతి కనిపించింది. 

కొనసాగుతున్న 17ఏ, 17సీ కాపీల సేకరణ

గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలోని 258 ఈవీఎంలలో గల సమాచారాన్ని సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియలో కీలకమైన 17ఏ, 17సీ డాక్యుమెంట్లను జిరాక్స్  తీసి సంబంధిత ఆఫీసర్లతో అటెస్ట్  చేస్తున్నారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీ కాపీలను సిద్ధం చేస్తున్నారు. వాటిని ఈ నెల 26న కోర్టుకు సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈవీఎంలకు భద్రత కల్పించలేదు: మహిపాల్

ధర్మపురిలోని స్ట్రాంగ్  రూంలో భద్రపరిచిన ఈవీఎంలు, ఎలక్షన్ మెటీరియల్ కు భద్రత కల్పించలేదని నయా భారత్  పార్టీ అభ్యర్థి దూడ మహిపాల్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి నయా భారత్  పార్టీ తరపున పోటీ  చేసిన మహిపాల్.. స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. స్ట్రాంగ్ రూంలో మూడు ట్రంకు పెట్టెలకు మాత్రమే సీలు వేసి ఉందని, మిగిలిన బాక్స్ లకు కనీసం తాళాలు కూడా లేవని చెప్పారు.

20 ట్రంకు పెట్టెల్లో నాలుగింటికే తాళాలు

స్ట్రాంగ్ రూముల్లో సుమారు 20కి పైగా ట్రంకు పెట్టెల్లో నాలుగు బాక్సులకు తాళాలు ఉన్నాయి. మిగిలిన వాటికి అసలు తాళాలు లేవు. ఆ నాలుగు బాక్సుల తాళాలకు కీస్ లేకపోతే ఆఫీసర్లు పగలగొట్టి ఓపెన్ చేశారు. నాలుగున్నరేండ్లుగా నేను పోరాటం చేస్తున్నా. న్యాయస్థానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది.  చివరికి న్యాయం గెలుస్తుంది.

–అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి, పిటిషనర్