కాల్వలకు రిపేర్లు చేయక పొలాల్లోకి నీళ్లు

కాల్వలకు రిపేర్లు చేయక పొలాల్లోకి నీళ్లు

కేసరి సముద్రం కాల్వలను పట్టించుకోని అధికారులు 
తెగి పొలాల పైనుంచి పారుతున్న నీళ్లు  
ఏండ్లుగా ఇదే గోస.. 
2 వేల ఎకరాలపై ప్రభావం

నాగర్ కర్నూల్ : ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం ఆరు గ్రామాల రైతులకు శాపంగా మారింది.  జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు కాల్వలను పట్టించుకోకపోవడంతో 2 వేల ఎకరాల  ఆయకట్టు సాగు చేయలేని పరిస్థితి నెలకొంది.  కాల్వల్లో జమ్ము పెరిగి, ఎక్కడికక్కడ తెగిపోతుండడంతో నీళ్లన్నీ పొలాల పైనుంచి పారుతున్నాయి. నాలుగేండ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో పంటలు వేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఇరిగేషన్  సీఈ, ఎస్ఈ, ఇతర అధికారులు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆరు ఊర్లు.. 2 వేల ఎకరాలు

కేసరి సముద్రం చెరువు కింద  ఎండబెట్ల, చందాయిపల్లి, గగ్గలపల్లి, మల్కాపూర్, పుల్జాల, తాళ్లపల్లికి సంబంధించిన 2వేల ఎకరాల ఆయకట్టు ఉంది.  దీనికి సాగునీరు ఇచ్చేందుకు నాగర్ కర్నూల్ వైపు రెండు తూములు, ఎండ్లబెట్ల వైపు రెండు తూములతో పాటు ఇరు వైపులా నాలుగు కాల్వలు ఏర్పాటు చేశారు.  కానీ,  దాదాపు 14 కిమీల పొడవు ఉండే కాల్వలకు 9 ఏండ్ల కింద తూతూ మంత్రంగా రిపేర్లు చేసిన అధికారులు మళ్లీ పట్టించుకోలేదు.  టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత  వట్టెం రిజర్వాయర్ కట్టకు నల్లమట్టిని తరలించేందుకు చెరువులో నీటిని కిందకు వదిలేశారు. చెరువులోకి చేరిన వర్షపు నీటితో పాటు  కేఎల్‌‌ఐ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే నీటి ఉధృతికి కాలువలు తెగిపోయాయి.  నాలుగేండ్లుగా ఇదే సీన్‌‌ రిపీట్ అయ్యి పొలాల్లో  మోకాళ్ల లోతు వరకు నీళ్లు చేరుతున్నారు.  అంతేకాదు చెరువులో నల్లమట్టి తవ్విన తర్వాత చెరువులో ఏర్పడ్డ భారీ గోతులతో బ్యాక్ వాటర్ విస్తీర్ణం పెరిగి ఉయ్యాలవాడ వైపున్న రైతుల పట్టా పొలాలు, ఏక్ ఫసల్ పట్టా పొలాలు నీటిలో మునిగిపోయాయి.  

ఆన్‌‌లైన్‌‌ రిజర్వాయర్లుగా మార్చట్లే..

కేఎల్‌‌ఐ కింద కాలువల ద్వారా పంటపొలాలకు సాగునీరు సప్లై చేస్తున్నా రిజర్వాయర్ల కెపాసిటీ చాలకపోవడంతో జిల్లాలో దాదాపు 500 చెరువులను నింపుతున్నారు. ఇందులో మైనర్ ఇరిగేషన్  పరిధిలోకి వచ్చే 100 ఎకరాల  ఆయకట్టు ఉన్న నోటిఫైడ్ చెరువులతో పాటు పెద్ద చెరువులు కూడా ఉన్నాయి.   వాస్తవానికి కేసరి సముద్రంతో సహా 29  మేజర్‌‌‌‌ చెరువులను ఆన్‌‌లైన్‌‌  రిజర్వాయర్లు మార్చాలని ప్రభుత్వం 2018లో ప్రపోజల్స్ తీసుకున్నా.. ఫండ్స్ లేవని పక్కకు పెట్టింది. ఆన్‌‌లైన్‌‌ రిజర్వాయర్లుగా మారుస్తూ నోటిఫికేషన్‌‌ ఇస్తే భూసేకరణ, రైతులకు పరిహారం డబ్బులు చెల్లించాల్సి వస్తోందని పక్కన పెట్టినట్లు తెలిసింది. 

పొలం మునిగిపోయింది

ఎండబెట్ల శివారులో 5.20 ఎకరాల భూమి ఉంది. గతంలో వ్యవసాయంతో పాటు పాలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడిని.  కాలువలు సరిగ్గా లేక చెరువు నీళ్లు పొలాలపై నుంచి పారుతుండడంతో సాగుకు పనిరాకుండా పోతున్నయి. నా పొలం చెరువులో మునగడంతో నాలుగేండ్లుగా పనిలేకుండా పోయింది .–మల్లికార్జున్,  చర్ల తిర్మలాపూర్  

పొలాన్ని పడావ్ పెట్టిన
కేసరి సముద్రం పెద్దచెరువులో నిండా నీళ్లున్నా నాగలి కట్టేటట్లు లేదు. కాల్వలు తెగి నీళ్లన్నీ పొలాల పైనుంచి పారుతున్నాయి. భూమి ఎందుకు పనికిరాకుండా పోయింది. నాలాగా వందల మంది రైతులు బాధలు పడుతున్నా అధికారులు పట్టించుకుంటలేరు. అనెమోని జంగయ్య, ఎండబెట్ల