
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'OG' (They Call Him OG) బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఫ్లిక్, సెప్టెంబర్ 24 సాయంత్రం జరిగిన పెయిడ్ ప్రీమియర్స్‌తో కలుపుకొని ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే ఊహించని వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు రూ.171 కోట్లు వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా 'OG' రికార్డు సృష్టించింది. గతంలో ఆయన అత్యధిక వసూళ్లు సాధించిన 'భీమ్లా నాయక్' లైఫ్‌టైమ్ రికార్డును కేవలం 48 గంటల్లోనే బద్దలు కొట్టింది.
రెండు రోజుల్లోనే రికార్డుల వేట..
ఈ చిత్రం గురువారం ప్రీమియర్స్, శుక్రవారం కలెక్షన్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను సాధించినట్లు DVV ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. అయితే సక్నిల్క్ వంటి ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం.. తొలి రెండు రోజుల్లో 'OG' ఇండియా నెట్ కలెక్షన్ రూ.103.50 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి అందిన రూ.47.35 కోట్ల గ్రాస్‌ను కలుపుకొని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
#TheyCallHimOG India Net Collection
— Sacnilk Entertainment (@SacnilkEntmt) September 27, 2025
Day 2: 18.75 Cr
Total: 103.5 Cr
India Gross: 123.65 Cr
Details: https://t.co/cHdAChuy36
200 కోట్ల క్లబ్‌లో పవన్ తొలి చిత్రం?
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రీమియర్‌లకు టికెట్ ధరలు వరుసగా రూ.1000, రూ.800 వరకు నిర్ణయించడం ఈ భారీ వసూళ్లకు దోహదపడింది. ఈ స్థాయిలో పెరిగిన టికెట్ ధరలు కూడా అభిమానుల ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. శుక్రవారం వసూళ్లలో కొద్దిపాటి తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ చిత్రం యొక్క బలమైన కలెక్షన్స్ పవన్ కళ్యాణ్‌కు తొలి రూ. 200 కోట్ల క్లబ్‌ను అందించవచ్చని ట్రేడ్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో 'సంక్రాంతికి వస్తున్నాం' రూ. 255 కోట్లు రాబట్టింది. అంతకు ముందు రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' రూ. 186 కోట్లు వసూళ్లను అధిగమించి, రెండో స్థానంలో నిలవడానికి 'OG' దూసుకుపోతోంది.
పవర్ ప్యాక్డ్ యాక్షన్
సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ముంబైలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన గ్యాంగ్‌స్టర్ ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) కథాంశంగా తెరకెక్కించారు.. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చేయని స్టైలిష్, ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో అదరగొట్టారు. రిటైర్ అయిన ఓజీని సత్య దాదా (ప్రకాష్ రాజ్) తిరిగి రంగంలోకి దించడం, ముంబై అండర్ వరల్డ్‌ను గడగడలాడించిన ఓమి భౌ (ఇమ్రాన్ హష్మి) ను ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, సుబ్బలేఖ సుధాకర్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కథనం ముగింపులో సీక్వెల్‌ను ప్రకటించడం ఈ ఫ్రాంఛైజీపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న 'OG' చిత్రం యొక్క ఫైనల్ కలెక్షన్ ఎంత ఉంటుందో చూడాలి.