భార్య ఎముకలు విరిగితేనే ‘గృహహింస’! అఫ్గానిస్తాన్లో కొత్త నిబంధనలపై సుప్రీం లీడర్ సంతకం

భార్య ఎముకలు విరిగితేనే ‘గృహహింస’! అఫ్గానిస్తాన్లో కొత్త నిబంధనలపై సుప్రీం లీడర్ సంతకం

అఫ్గానిస్తాన్ ప్రభుత్వం అక్కడి మహిళల విషయంలో మరో అరాచకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. భర్త దాడిలో భార్య ఎముకలు విరగకపోతే అది నేరం కాదంటూ.. గృహహింస చట్టం చేసింది. రక్తస్రావం కానంతవరకు మహిళలను ఎంత శిక్షించినా అది తప్పు కాదని పేర్కొంది.

కాబుల్: అఫ్గానిస్తాన్ ప్రభుత్వం అక్కడి మహిళల విషయంలో మరో అరాచకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. భర్త దాడిలో భార్య ఎముకలు విరగకపోతే అది నేరం కాదని.. గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేసింది. రక్తస్రావం కానంతవరకు ఇంట్లో మగవారు మహిళలను శారీరకంగా ఎంత శిక్షించినా అది తప్పు కాదని పేర్కొంది. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలపై అఫ్గానిస్తాన్ సుప్రీంలీడర్ హిబుతుల్లా అఖుంర్జాదా సంతకాలు చేశారు. 

కొత్త నిబంధనల ప్రకారం.. భర్త దాడి చేయడం వల్ల గాయాలై, ఎముకలు విరిగి బయటకు కనిపిస్తే .. ఆ భర్తకు కేవలం 15 రోజులు మాత్రమే జైలుశిక్ష విధిస్తారు. అదికూడా దాడికి గురైన మహిళ కోర్టులో గాయాలను చూపిస్తేనే శిక్షవేస్తారు. ఇక, ఆ మహిళ కోర్టుకు వెళ్లినప్పుడు వెంట ఆమె బాధ్యత చూసుకొనే పురుషుడు ఉండాలి. 

అలాగే, జడ్జికి  గాయాలను చూపిస్తున్నప్పుడు  పూర్తిగా బట్టలు కప్పుకొనే ఉండాలి. ఇక మహిళల విషయానికి వస్తే.. భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే.. 3 నెలల జైలు శిక్ష పడుతుంది. మరోవైపు, ఆర్టికల్ 9 ప్రకారం.. అఫ్గాన్ సమాజాన్ని నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. మత పెద్దలు (ఉల్మా), ఉన్నతవర్గం(అప్రాప్), మధ్యతరగతి, దిగువ తరగతిగా విభజించారు. దీనికింద నేర తీవ్రతను బట్టి కాకుండా వర్గాలను బట్టి శిక్షలు విధించనున్నారు. 

భయాందోళనలో బార్బర్లు..

తాలిబాన్ ప్రభుత్వం పురుషుల గడ్డం పొడవు విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా బార్బర్లు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం, పురుషుల గడ్డం ఉండాల్సిన పొడవు కంటే తక్కువగా కత్తిరించకూడదు. పూర్తిగా షేవ్ చేసుకోవడం లేదా ట్రిమ్ చేయడం నిషిద్ధం. ఈ నియమాలను ఉల్లంఘించినవారిని, ముఖ్యంగా బార్బర్లను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బార్బర్లు భయాందోళనకు గురవుతున్నారు.