
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గత సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్లో రూ.8,764 కోట్ల లాభం సంపాదించింది. అంతకుముందు సంవత్సరం క్యూ3 లాభం రూ.1,258 కోట్లతో పోలిస్తే ఇది 596.7 శాతం పెరిగింది. చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. తాజాగా క్వార్టర్లో చమురు పీపా ధర 75.73 డాలర్లు కాగా, ఇది అంతకుముందు ఏడాది క్యూ3లో 43.20 డాలర్లు ఉండేది. గ్యాస్ ధర ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 1.79 డాలర్ల నుంచి 2.90 డాలర్లకు పెరిగింది. అయితే ఆయిల్ ప్రొడక్షన్3.2 శాతం తగ్గి 5.45 మిలియన్ టన్నులకు పడిపోయింది. గ్యాస్ తయారీ 4.2 శాతం తగ్గి 5.5 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. కొవిడ్, తౌట్కే తుఫాన్, సాగర్ సామ్రాట్ యూనిట్ ప్రారంభం ఆలస్యం కావడం, హజీరాలో నిర్మాణ పనులు జరుగుతుండం, వశిష్ట ఫీల్డ్‌లో రిజర్వాయర్ సమస్యల కారణంగా ప్రొడక్షన్ తగ్గింది.