ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నడిగడ్డకు వరం : మంత్రి నిరంజన్ రెడ్డి

ఆయిల్ పామ్  ఫ్యాక్టరీ నడిగడ్డకు వరం : మంత్రి నిరంజన్ రెడ్డి

గద్వాల, వెలుగు: ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీ నడిగడ్డకు వరమని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగాలతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంగళవారం మినిస్టర్  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఏర్పాటుతో 1,800 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. 2003లో నష్టాల పేరుతో బీచుపల్లి ఆయిల్  ఫ్యాక్టరీని మూసి వేశారని, మంత్రి అయ్యాక ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయిల్ ఫెడ్  ద్వారా ఫ్యాక్టరీ పునరుద్దరణకు కృషి చేసినట్లు చెప్పారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ.51 వేలు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫెడ్  చైర్మన్  రామకృష్ణారెడ్డి, అడిషినల్  కలెక్టర్  అపూర్వ్ చౌహాన్, ఎమ్మెల్యే వీఎం అబ్రహం, కార్పొరేషన్  చైర్మన్  గట్టు తిమ్మప్ప, ఆయిల్ ఫెడ్  ఎండీ సురేందర్, ఉద్యానశాఖ జేడీ సరోజిని పాల్గొన్నారు.

ముదిరాజ్ లను బీసీ- ఏలో చేర్చేందుకు కృషి..

వనపర్తి: ముదిరాజ్ లను బీసీ–ఏలో చేర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్  ఆఫీస్​లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.2 కోట్లతో వనపర్తిలో మత్స్యకారుల భవన్ కు ఈ నెల 5న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేపలు, రొయ్యల పెంపకం చేపట్టి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లా మత్స్యకారుల సంక్షేమ సంఘం సభ్యులు సత్యనారాయణ, లైబ్రరీ చైర్మన్  బొలెమోని లక్ష్మయ్య, మున్సిపల్​ వైస్  చైర్మన్  వాకిటి శ్రీధర్, బాల్ రాజు, అరుణ్ ప్రకాశ్, లక్ష్మీనారాయణ, రవి, శ్యామ్, మహేశ్, ఆవుల రమేశ్, కాగితాల గిరి పాల్గొన్నారు.