ఢిల్లీ వాసులకు షాక్.. ఓలా, ఊబర్ బైక్ బంద్

ఢిల్లీ వాసులకు షాక్.. ఓలా, ఊబర్ బైక్ బంద్

ప్రముఖ క్యాబ్ అక్రికేటర్లు ఓలా, ఊబర్, ర్యాపిడోకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. బైక్, ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని చెప్పింది. నాన్ ట్రాన్స్ పోర్ట్ కేటగిరీకి చెందిన వాహనాలను ట్యాక్సీల కోసం వినియోగిస్తుండటంతో ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మోటార్ వాహనాల చట్టం 1988ని ఉల్లంగించడమే అవుతుందని ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది.

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా బైక్, ట్యాక్సీలు నడిపితే రూ.5వేలు జరిమానా విధిస్తామని ఢిల్లీ సర్కార్ హెచ్చరించింది. పునరావృతమైతే రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించింది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తామని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కేవలం ఫోర్ విల్లర్లు, ఆటో, రిక్షాలు, ఇ రిక్షాలు మాత్రమే ట్యాక్సీ సర్వీసుల కింద నడపడానికి అనుమతి ఉందని.. బైక్‭లకు అనుమతి లేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. టు విల్లర్, త్రి విల్లర్, ఫోర్ విల్లర్‭కు సంబంధించి కొత్త అగ్రిగేటెడ్ పాలసీని రూపొందిస్తున్నామని త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నామని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు తెలిపారు.