ఎంజీఎంలో స్ట్రెచర్ దొరకక..  భార్యను భుజాలపై మోసుకెళ్లిన వృద్ధుడు

ఎంజీఎంలో స్ట్రెచర్ దొరకక..  భార్యను భుజాలపై మోసుకెళ్లిన వృద్ధుడు
  • ఎంజీఎంలో స్ట్రెచర్ దొరకక..  భార్యను భుజాలపై మోసుకెళ్లిన వృద్ధుడు
  • స్ట్రెచర్‍ అడిగితే ఇవ్వలేదన్న పేషెంట్‍ భర్త  
  • సోషల్‍ మీడియాలో వీడియో వైరల్ 
  • బద్నాం చేసేందుకే  వైరల్‍ చేశారన్న ఆఫీసర్లు

వరంగల్‍/వరంగల్​ సిటీ, వెలుగు: వరంగల్‍ ఎంజీఎం దవాఖానలో నడవలేని స్థితిలో ఉన్న ఓ అవ్వను ఆమె భర్త భుజాల మీద మోసుకుని వెళ్లిన ఘటన సంచలనంగా మారింది. అవ్వను తాత మోసుకెళ్తున్న దృశ్యాన్ని కొందరు వ్యక్తులు మొబైల్​తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేకులపల్లి మండలం ముత్యాలంపాడుకు చెందిన మాలోతు లక్ష్మి కాలికి తీవ్ర గాయం కావడంతో 7 నెలల క్రితం ఎంజీఎం దవాఖానకు వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి కుడి కాలును మోకాలు వరకు తొలగించారు. మందులిచ్చి ఇంటికి పంపారు. ఆరు నెలల తర్వాత మళ్లీ రావాలని సూచించారు. 

ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ శుక్రవారం ఉదయం ఎంజీఎంకు వచ్చారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో కృత్రిమ కాలు అందించే కాలిపర్‍ సెంటర్​కు వెళ్లారు. తాళం వేసి ఉండటంతో డాక్టర్ రాలేదని భావించి బయటకొచ్చారు. కాసేపటి తర్వాత మళ్లీ సెంటర్‍కు వెళ్లేందుకు ప్రయత్నిస్తే స్ట్రెచర్‍ దొరకలేదు. దీంతో చేసేదేమీలేక భర్త లచ్చులు తన భార్యను భుజంపై ఎత్తుకుని కొద్ది దూరంలో ఉన్న చెట్టు కింద కూర్చొబెట్టి, తానొక్కడే మళ్లీ సెంటర్‍ వద్దకు వెళ్లాడు. వీరికి ట్రీట్‍మెంట్‍ అందించాల్సిన డాక్టర్ శుక్రవారం అందుబాటులో లేరని, శనివారం వస్తారని సిబ్బంది చెప్పడంతో వెనక్కివచ్చాడు. అయితే, స్ట్రెచర్ అడిగితే ఇవ్వకపోవడంతోనే తన భార్యను మోసుకెళ్లినట్లు లచ్చులు చెప్పాడు. ఎంజీఎంలో కనీసం స్ట్రెచర్ కూడా అరేంజ్ చేయకపోవడం ఏమిటంటూ హాస్పిటల్ అధికారులపై, సిబ్బందిపై నెటిజన్​లు మండిపడ్డారు.  

బద్నాం చేస్తున్నరు: ఎంజీఎం సూపరింటెండెంట్‍

పేషెంట్ లక్ష్మికి స్ట్రెచర్ ఇవ్వలేదన్నది నిజం కాదని ఎంజీఎం సూపరింటెండెంట్‍ డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శుక్రవారం డ్రెస్సింగ్‍ పూర్తయ్యాక సిబ్బంది ఆమెను స్ట్రెచర్‍లో బయటున్న చెట్టు వద్ద దించి మరో పేషెంట్ కోసం వెళ్లారని చెప్పారు. ఎండ తీవ్రత వల్ల ఒక చెట్టు నుంచి మరో చెట్టు వద్దకు తన భార్యను తీసుకువెళుతుండగా కొందరు కావాలనే హస్పిటల్‍ పేరు బద్నాం చేసేలా వీడియోలు తీసి వైరల్‍ చేశారన్నారు.