బలమైన దేశాన్ని నిర్మిద్దాం.. ఉభయ సభల ఎంపీలకు మోదీ పిలుపు

బలమైన దేశాన్ని నిర్మిద్దాం.. ఉభయ సభల ఎంపీలకు మోదీ పిలుపు
  • ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్​లో ఫేర్ వెల్ మీటింగ్

న్యూఢిల్లీ :   దేశ ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్త చట్టాలు, సంస్కరణలు ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అందరం కలిసి బలమైన దేశాన్ని నిర్మిద్దాం. ఇండియాను 2047 నాటికి  అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాం” అని ఎంపీలకు పిలుపునిచ్చారు. మంగళవారం పార్లమెంట్ పాత బిల్డింగులోని సెంట్రల్ హాల్ లో నిర్వహించిన ఫేర్ వెల్ మీటింగ్ లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ఈ రోజు మనం పార్లమెంట్ కొత్త బిల్డింగులోకి వెళ్తున్నాం. ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కొత్త బిల్డింగులోకి అడుగు పెడుతున్నాం. దాని కోసం నిరంతరం కృషి చేద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు. ‘‘చిన్న కాన్వాస్ పై పెద్ద చిత్రం గీయడం కుదురుతుందా? అలాగే మన ఆలోచనలు చిన్నవిగా ఉంటే, ‘భవ్య భారత్’ సాధ్యం కాదు. మన ఆలోచనలను విస్తృతం చేయాలి. భవ్య భారత్ ను నిర్మించి భవిష్యత్ తరాలకు అందించాలి” అని అన్నారు. ‘‘ఈ రోజు మనం పార్లమెంట్ కొత్త బిల్డింగులోకి వెళ్తున్నాం. ఇది కొత్త భవిష్యత్తుకు ఆరంభం. మనం కొత్త బిల్డింగులోకి వెళ్లినంత మాత్రాన, పాత బిల్డింగ్ గౌరవం తగ్గిపోకూడదు. మనం దీన్ని కేవలం ‘ఓల్డ్ పార్లమెంట్’ అని పిలవకూడదు. మీరందరూ ఒప్పుకుంటే పాత బిల్డింగ్ కు ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెడదాం. అది ఎప్పుడూ మనకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది” అని చెప్పారు. పార్లమెంట్ పాత బిల్డింగ్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిందని పేర్కొన్నారు. ‘‘1952 నుంచి ఇప్పటి వరకు ఈ సెంట్రల్ హాల్ లో 41 దేశాల లీడర్లు మన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పార్లమెంట్ బిల్డింగులో గత 70 ఏండ్లలో 4 వేలకు పైగా చట్టాలను ఆమోదించాం. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి, ముస్లిం మహిళలకు న్యాయం చేశాం. ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులకు న్యాయం జరిగేలా చట్టాలు తెచ్చాం. ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకాశ్మీర్ లో మన రాజ్యాంగం అమలయ్యేలా చేశాం” అని చెప్పారు.  

ఇకపై ‘సంవిధాన్ సదన్’..

పార్లమెంట్ పాత బిల్డింగ్ ను ఇక నుంచి ‘సంవిధాన్ సదన్’గా పిలవనున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. హౌస్, లాబీ, గ్యాలరీ పదాలను కొత్త బిల్డింగులోనూ లోక్ సభ ప్రొసీడింగ్స్ లో వాడనున్నట్టు పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఫేర్ వెల్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. పాత బిల్డింగ్ కు ‘సంవిధాన్ సదన్’గా పేరు పెడదామని ప్రతిపాదించారు.

ఎంపీల గ్రూప్ ఫొటో

ఓల్డ్​పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన ఫేర్ వెల్ మీటింగ్ తర్వాత ఉభయ సభల ఎంపీలు గ్రూప్ ఫొటో దిగారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌధురి తదితరులు పాల్గొన్నారు. ఫొటో సెషన్ సందర్భంగా ఎంపీలు రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోయారు. మహిళా ఎంపీలు చీరకట్టులో వచ్చారు. కాగా, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు విడివిడిగా కూడా గ్రూప్ ఫొటో దిగారు.