IND vs ENG 1st Test: పోప్ భారీ సెంచరీ..రసవత్తరంగా ఉప్పల్ టెస్ట్

IND vs ENG 1st Test: పోప్ భారీ సెంచరీ..రసవత్తరంగా ఉప్పల్ టెస్ట్

ఉప్పల్ టెస్ట్ లో టీమిండియాకు ఇంగ్లాండ్ గట్టి పోటీనిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా..రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేస్తుంది. ముఖ్యంగా ఓలీ పోప్ ఒక్కడే 148 పరుగులు చేసి మన బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. పట్టుదలగా ఆడి ఇంగ్లాండ్ ఆశలను సజీవంగా ఉంచాడు. దీంతో మూడో ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. మూడో రోజు టీ విరామ సమయానికి 5 వికెట్లు తీసి జోరు మీదున్న భారత్ కు చివరి సెషన్ లో వికెట్ కీపర్ ఫోక్స్ వికెట్ మాత్రమే తీయగలిగింది. 

స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఫోక్స్ బౌల్డయ్యాడు. ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ తో కలిసి ఆరో వికెట్ కు 112 పరుగులు జోడించిన పోప్.. 7 వ వికెట్ కు రెహన్ అహ్మద్ తో కలిసి అజేయంగా 41 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్ లో పోప్ (148), రెహన్ అహ్మద్ (16) ఉన్నారు. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ లో ఎలాంటి ఫలితమైన వచ్చే అవకాశం కనిపిస్తుంది.                

లంచ్ తర్వాత ఇంగ్లాండ్.. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించింది. భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ పోప్, ఫోక్స్ స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. ఎలాంటి చిన్న అవకాశం ఇవ్వకుండా టీమిండియా బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసినా.. రెహన్ అహ్మద్ తో కలిసి పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. చివరి రెండు రోజులు స్పిన్ బాగా తిరుగుతుంది కాబట్టి ఇంగ్లాండ్ చివరి నాలుగు వికెట్లను మరో 100 పరుగులు జోడించినా భారత్ ఛేజ్ చేయడం కష్టమవుతుంది. నాలుగో రోజు భారత్ ఎంత త్వరగా వికెట్లు తీస్తారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడ్డాయి.