స్పీకర్‌‌‌‌పై అవిశ్వాసం.. వ్యతిరేకిస్తున్న కొన్ని పార్టీలు 

స్పీకర్‌‌‌‌పై అవిశ్వాసం.. వ్యతిరేకిస్తున్న కొన్ని పార్టీలు 
  • యోచిస్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీలతో చర్చలు
  •     ఓంబిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారణ ఆరోపణ
  •     ప్రతిపక్ష ఐక్యత దెబ్బతింటుందని ఆందోళన
  •     అవిశ్వాస తీర్మానంపై కనీసం 50 మంది ఎంపీల సంతకాలు అవసరం

న్యూఢిల్లీ: లోక్‌‌సభ స్పీకర్‌‌‌‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో పక్షపాతంతో, తొందరపాటుతో ఓం బిర్లా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. వచ్చే సోమవారం సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్‌‌ పెట్టాలని భావిస్తున్నాయి. మంగళవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇతర ప్రతిపక్ష పార్టీలతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. అయితే ఈ ప్రతిపాదనను కొన్ని పార్టీలు వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ చర్య ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తుందని చెప్పినట్లు తెలిసింది. ‘‘సభ ఆర్డర్‌‌‌‌లో ఉన్నప్పుడు మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. తీర్మానంపై 50 మంది ఎంపీల సంతకాలు, మద్దతు అవసరం. సభ ఆర్డర్‌‌‌‌ లేదనే కారణంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చు” అని ప్రతిపక్ష శిబిరంలోని వర్గాలు తెలిపాయి.

లోక్‌‌సభ నిమిషానికే వాయిదా

అదానీ అంశంపై లోక్‌‌సభలో నిరసనలు కొనసాగాయి. నలుపు రంగు డ్రస్సుల్లో వచ్చిన పలువురు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ నిమిషానికే వాయిదా పడింది. క్వశ్చన్ అవర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ సభ్యులు ఎస్.జోతి మణి, రమ్య హరిదాస్.. పేపర్లను చించి స్పీకర్ చైర్‌‌‌‌పై విసిరారు. అదే పార్టీకి చెందిన మరో సభ్యుడు టీఎన్ ప్రతాపన్.. నల్ల కండువాను విసిరారు. అయితే మార్షల్స్ మధ్యలోనే అడ్డుకున్నారు.

దీంతో స్పీకర్ స్థానంలో కూర్చున్న పీవీ మిథున్ రెడ్డి.. సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశాలు ప్రారంభం కాగా.. ప్రతిపక్ష సభ్యులు వెల్‌‌లోకి దూసుకెళ్లారు. అదానీ వ్యవహారంపై జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) వేయాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్యనే పలు రిపోర్టులను టేబుల్ చేశారు. ‘సేవ్ డెమోక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకున్న ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభను రోజంతా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న రమా దేవి ప్రకటించారు.

రాజ్యసభలో కొనసాగిన గందరగోళం

ఉదయం సభ ప్రారంభం కాగానే అదానీ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ‘మోడీ– అదానీ భాయ్ భాయ్’ అంటూ సభ్యులు నినాదాలు చేశారు. కొందరు కాంగ్రెస్ ఎంపీలు వెల్‌‌లోకి దూసుకెళ్లారు. కేంద్ర మంత్రి హర్‌‌‌‌దీప్ సింగ్ పురీ మాట్లాడుతుండగా.. మరింత గట్టిగా నినాదాలు చేశారు. లిస్ట్ చేసిన వ్యవహారాలను సస్పెండ్ చేయాలని, తాము నోటీసుల్లో పేర్కొన్న అంశాలను చర్చించాలని రూల్267 కింద అపొజిషన్ మెంబర్లు నోటీసులు ఇచ్చారని ధన్‌‌కర్ చెప్పారు.

అయితే నినాదాలు కొనసాగడంతో సస్పెన్షన్ నోటీసులపై తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించలేదు. తర్వాత సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశం కాగా.. సభలో చర్చ కోసం షెడ్యూల్ చేసిన బిల్లుల గురించి చైర్మన్ జగదీప్ ధన్‌‌కర్ ప్రస్తావించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. విమానయాన పరిశ్రమ వల్ల కలిగే నికర నష్టానికి సంబంధించిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తరఫున మరో కేంద్ర మంత్రి వీకే సింగ్ సవరించారు. ఆ వెంటనే సభను వాయిదా వేస్తున్నట్లు ధన్‌‌కర్ ప్రకటించారు.