లక్షా 20 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

లక్షా 20 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27,553 మంది కరోనా బారినపడ్డారు. ముందు రోజుతో పోలిస్తే 21 శాతం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో అయితే ఏకంగా ఒక్క రోజులో 51.2 శాతం అదనంగా కేసులు వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 284 మంది మరణించగా.. 9,249 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,22,801 యాక్టివ్ కేసుల లోడ్ ఉంది. అయితే రికవరీ రేటు 98.27 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 2.55 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 1.35 శాతానికి పెరిగిందని చెప్పింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 145.44 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్రం వెల్లడించింది.

మహారాష్ట్రలో 460 ఒమిక్రాన్ కేసులు

మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1,525కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 460 కేసులు రాగా, అందులో 180 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఢిల్లీలో 351, గుజరాత్‌లో 136, తమిళనాడులో 117, కేరళలో 109, రాజస్థాన్‌లో 69 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 560 మంది ఒమిక్రాన్ పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు.