టిమ్స్​లో ఒమిక్రాన్​ వార్డు

టిమ్స్​లో ఒమిక్రాన్​ వార్డు
  • ఆస్పత్రిలో ఒక ఫ్లోర్​ మొత్తం కేటాయింపు
  • ముప్పున్న 12 దేశాల ప్యాసింజర్లకు ఎయిర్​‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్​ టెస్ట్​
  • పాజిటివ్​ వస్తే ఒమిక్రాన్​ వార్డులో ఐసోలేషన్​
  • మిగతా దేశాల వాళ్లకు రూల్స్​ నుంచి మినహాయింపు
  • ఎల్లుండి నుంచి కొత్త రూల్స్​ అమల్లోకి

హైదరాబాద్​, వెలుగు: కరోనా కొత్త వేరియంట్​ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే కరోనా పేషెంట్ల కోసం టిమ్స్​లో ఆరోగ్య శాఖ ‘ఒమిక్రాన్​ వార్డు’ను ఏర్పాటు చేయనుంది. అందుకోసం ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్​ మొత్తాన్ని కేటాయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలోని 12 ఎట్ ​రిస్క్​ (ముప్పున్న) దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్​పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ చేసి.. పాజిటివ్​ వస్తే టిమ్స్​కు తరలించనుంది. వేరియంట్​ తేలేవరకు పేషెంట్లందరికీ అక్కడే ట్రీట్​మెంట్​ అందించాలని నిర్ణయించింది. బ్రిటన్​, ఆఫ్రికా, బ్రెజిల్​, బంగ్లాదేశ్​, బోట్స్​వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్​, జింబాబ్వే, సింగపూర్​, హాంకాంగ్​, ఇజ్రాయెల్​లకు ఈ కొత్త రూల్స్​ వర్తిస్తాయని అధికారులు చెప్పారు. ఆ దేశాల నుంచి వచ్చేటోళ్లు నెగటివ్​ సర్టిఫికెట్​ చూపించినా, రెండు డోసుల వ్యాక్సిన్​ను తీసుకున్నా.. ఇక్కడ దిగాక మళ్లీ ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ చేయించుకోవాల్సి ఉంటుంది. బుధవారం నుంచి ఈ కొత్త రూల్​ను అమల్లోకి తీసుకురానున్నారు.  
నెగెటివ్​ వస్తే ఇంట్లోనే..
ఎయిర్​‌పోర్టులో చేసిన ఆర్టీపీసీఆర్​ టెస్టులో నెగటివ్​ వచ్చిన వారిని హోం క్వారంటైన్​లో ఉంచనున్నారు. వాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా లోకల్​ పోలీసుల సాయంతో హెల్త్​ ఆఫీసర్లతో నిఘా పెడ్తామని అధికారులు చెప్పారు. వారం తర్వాత మరోసారి ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ చేసి, నెగటివ్​ వస్తే క్వారంటైన్​ నుంచి రిలీవ్​ చేస్తామన్నారు. ఒకవేళ పాజిటివ్​ వస్తే టిమ్స్​కు తీసుకెళ్లి.. ఇంట్లో వాళ్లను క్వారంటైన్​ చేస్తామని తెలిపారు. అందరి శాంపిల్స్​ సేకరించి జీనోమ్​ సీక్వెన్సింగ్​కు పంపాలని నిర్ణయించారు.
టెస్ట్​ చేయకుండానే పంపించిన్రు
ముప్పున్న జాబితాలోని బ్రిటన్​ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్​లో సోమవారం 223 మంది ప్రయాణికులు వచ్చారు. వాళ్లందరికీ ఎయిర్​‌పోర్టులో టెస్టులు చేయకుండానే పంపించారు. దీనిపై హెల్త్ ఆఫీసర్లను ఆరా తీయగా కొత్త రూల్స్​ డిసెంబర్​ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం సూచించిందని చెప్పారు. బ్రిటన్​ నుంచి వచ్చిన వాళ్లందరి వద్ద కరోనా నెగటివ్​​ సర్టిఫికెట్​ ఉందని, చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్​ కూడా తీసుకున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎట్​ రిస్క్​ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చినోళ్లకు డిసెంబర్​ ఒకటో తేదీ నుంచి కూడా పాత రూల్సే ఉంటాయన్నారు. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్​ టెస్ట్​ నెగటివ్​ రిపోర్ట్​, రెండు డోసుల వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ చూపించాల్సి ఉంటుందున్నారు. వాళ్లకు ఎలాంటి టెస్ట్​ చేయకుండానే ఇంటికి పంపించనున్నారు.