రామ్‌ లల్లా విగ్రహాన్ని వాళ్లే తొలగించారు: యోగి ఆదిత్యనాథ్

రామ్‌ లల్లా విగ్రహాన్ని వాళ్లే తొలగించారు: యోగి ఆదిత్యనాథ్

అయోధ్య: ఇవ్వాళ రామ నామం జపం చేస్తున్న వాళ్లే ఆరోజు అయోధ్యలో నుంచి రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించారని ఉత్తర్‌‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్య రామాలయ భూమి పూజకు కాంగ్రెస్ నేత ప్రియాంక మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆమెకు కౌంటర్‌‌గా యోగి పైవిధంగా స్పందించారు.

‘కొందరు ఇప్పుడు రామ నామస్మరణ చేస్తున్నారు. వీళ్లే రామ్ లల్లా విగ్రహ తొలగింపునకు బాధ్యులు. నిర్ణీత ప్రదేశం నుంచి 200 మీటర్లు దూరంగా శిలాన్యాస్ చేయాలని వారు కోరుకున్నారు. మేం అందర్ని పిలవాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా కేవలం 200 మందిని మాత్రమే ఆహ్వానించాం. బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు (జేపీ నడ్డా) కూడా ఈవెంట్‌కు హాజరవ్వలేదు. భగవాన్ రాముడు అందరి కోసం ఉన్నాడు. ఆయన పేరును వాడుకొని సమాజాన్ని విడదీయాలని యత్నించకూడదు. రాముడి ద్వారా ప్రజలను ఏకం చేయాలనే మేం అనుకున్నాం. ఇవ్వాళ కొందరు ఎవరైతే రామ నామాన్ని జపం చేస్తున్నారో వారు 1949, 1984 ఆ తర్వాతి సంవత్సరాల్లో తమ అభిప్రాయాలను గురించి ఆలోచించాలి. వాళ్లు ఇప్పుడు వేరే పరిభాషలో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు వారు వేరేలా మాట్లాడారు. శ్రీరాముడ్ని ఎవరైతే ఇరుకైన మనుస్సుతో చూస్తారో వాళ్లే ఎన్నికల సమయంలో హిందూ ఓటర్లకు తమ మద్దతు తెలపడానికి ఆలయాలను సందర్శిస్తారు’ అని యోగి పేర్కొన్నారు. తన కంటే ముందు యూపీకి చెందిన ఏ ఒక్క సీఎం కూడా అయోధ్యను సందర్శించలేదన్నారు. టెంపుల్ టౌన్‌లో అడుగు పెట్టడానికి వాళ్లందరూ భయపడ్డారని విమర్శించారు.