
– 1992 స్కామ్‌ను గుర్తు చేస్తూ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ : అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ..కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అదానీ గ్రూప్ స్టాక్‌ల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి..? ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను నష్టపరిచింది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారు? అంటూ పలు ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన ప్రశ్నలు ఇవి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. హర్షద్ మెహతా 1992 స్కామ్ గుర్తుకొస్తుందంటూ కేసీఆర్ ట్విట్టర్ లో ప్రస్తావించారు.
అసలు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఏంటి?
న్యూయార్క్ కేంద్రంగా హిండెన్‌బర్గ్ రీసెర్చి సంస్థ పని చేస్తోంది. 2017లో నాథన్ అండర్సన్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని ‘హిండెన్‌బర్గ్’ తన వెబ్‌సైట్‌లో స్వయంగా వెల్లడించింది. పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను ఇది విశ్లేషిస్తుంది. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చి సేవలు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను కూడా పసిగడుతుంది. ఈ కంపెనీ షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెడుతుంది.
అదానీ గ్రూపుపై భారీ ఎఫెక్ట్
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ షేర్ల పతనం సెగ కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ఇలా జరగడం గమనార్హం. ఈ నెల 27న అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం భారీగా కొనసాగడంతో కీలక సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. అలాగే బ్యాంకింగ్, మెటల్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 17500 స్థాయిని కోల్పోయింది. అదానీ మార్కెట్ లక్షల కోట్లు తుడుచు పెట్టుకుపోయింది.