అమెరికా వస్తువులు వద్దు.. మండిపడుతున్న నెటిజన్లు.. టారిఫ్లపై తీవ్ర వ్యతిరేకత

అమెరికా వస్తువులు వద్దు.. మండిపడుతున్న నెటిజన్లు.. టారిఫ్లపై తీవ్ర వ్యతిరేకత

న్యూఢిల్లీ: భారతదేశ వస్తువులపై అమెరికా 50శాతం టారిఫ్​ను విధించడంపై మనదేశంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అమెరికన్  బ్రాండ్స్​పై నెటిజన్లు మండిపడుతున్నారు. మెక్‌‌‌‌‌‌‌‌డొనాల్డ్స్, కోక-కోలా, అమెజాన్, యాపిల్ వంటి కంపెనీలు ప్రొడక్టులను నిషేధించాలని సోషల్​మీడియాలో డిమాండ్లు కనిపిస్తున్నాయి. వాటిని కొనడం మానేసి దేశీయంగా తయారైన వస్తువులను ఆదరించాలని పిలుపునిస్తున్నారు.  దేశీయ వస్తువులకు అనుకూలంగా, అమెరికా వస్తువుల బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంటోందని రాయిటర్స్ రిపోర్ట్​ చేసింది.  భారతదేశ జనాభా అమెరికన్ కంపెనీలకు చాలా కీలకమైన మార్కెట్. అమెరికన్​ కంపెనీ మెటాకు చెందిన వాట్సాప్‌కు ప్రపంచంలోనే అత్యధిక కస్టమర్లు మనదేశంలోనే ఉన్నారు. 

పిజ్జా వంటివి అమ్మే డోమినోస్ రెస్టారెంట్​కు అత్యధిక ఔట్​లెట్లు ఇక్కడే ఉన్నాయి. అమెరికన్ సాఫ్ట్​డ్రింక్స్​ కంపెనీలు పెప్సీ, కోకా-కోలాకు ఇండియాలో బలమైన మార్కెట్​ఉంది. యాపిల్ స్టోర్స్, స్టార్‌‌‌‌‌‌‌‌బక్స్  కూడా భారీ ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. వావ్ స్కిన్ సైన్స్ కో–ఫౌండర్​మనీష్ చౌదరి దేశీయ రైతులు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు మద్దతుగా లింక్డ్‌‌‌‌‌‌‌‌ఇన్‌‌‌‌‌‌‌‌లో ఒక వీడియోను షేర్​చేశారు. మేడ్ ఇన్ ఇండియా  ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. సౌత్ కొరియా ఆహార, సౌందర్య రంగాలలో సాధించిన విజయాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

‘‘మనం వేల మైళ్ల దూరంలోని ఉత్పత్తుల కోసం క్యూలో నిలబడి ఉన్నాం. మన దేశంలో మన తయారీదారులు గుర్తింపు కోసం పోరాడుతుంటే,  మనకు చెందని బ్రాండ్‌‌‌‌‌‌‌‌ల కోసం ఖర్చుపెడుతున్నాం’’ అని ఆయన అన్నారు.  భారతదేశం తన సొంత సోషల్ మీడియా టెక్నాలజీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లను అభివృద్ధి చేసుకోవాలని డ్రైవ్ యూ సీఈఓ రామ్ శాస్త్రి లింక్డ్‌‌‌‌‌‌‌‌ఇన్‌‌‌‌‌‌‌‌లో రాశారు. చైనాలో ఉన్నట్లే భారతదేశానికి తన సొంత ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఎఫ్‌‌‌‌‌‌‌‌బీ ఉండాలని అన్నారు. భారతీయ రిటైల్ సంస్థలు స్థానిక మార్కెట్‌‌‌‌‌‌‌‌లో స్టార్‌‌‌‌‌‌‌‌బక్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లతో విజయవంతంగా పోటీపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం కష్టంగా మారింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ టెక్నాలజీ సర్వీస్ కంపెనీలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఖాతాదారులకు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ సొల్యూషన్లను అందిస్తూ సత్తా చాటుతున్నాయి.

50 దేశాలకు ఎగుమతులు పెంపు.. అమెరికా టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో స్ట్రాటజీ మార్చిన ఇండియా 
అమెరికా  భారత వస్తువులపై  50 శాతం టారిఫ్ విధించడంతో  మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఆఫ్రికా వంటి ప్రాంతాల్లోని 50 దేశాలకు ఎగుమతులు పెంచుకోవాలని  ప్రభుత్వం చూస్తోంది.  మన ఎగుమతుల్లో 90శాతం  ఈ 50 దేశాలకు వెళుతున్నాయి.  ఎగుమతుల డైవర్సిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వైవిధ్యం),   దిగుమతులకు ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసుకోవడం, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ  పనిచేస్తోందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. "ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి  పూర్తిస్థాయి విశ్లేషణ జరుగుతోంది" అని  అన్నారు.

గతంలో 20 దేశాలపై దృష్టి సారించిన మంత్రిత్వ శాఖ, ఇప్పుడు మరో 30 దేశాలను వ్యూహంలో చేర్చింది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత ఎగుమతులు 35.14 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.  అయితే వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్టమైన 18.78 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎగుమతులు 1.92 శాతం పెరిగి 112.17 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 4.24% పెరిగి 179.44 బిలియన్ డాలర్లకు చేరాయి.