ఏటీఎం చోరీ కేసులో ఒకరు అరెస్ట్‌

ఏటీఎం చోరీ కేసులో ఒకరు అరెస్ట్‌

హుజురాబాద్‌, వెలుగు: కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని ఓ ఎస్‌బీఐ ఏటీఎంలో మార్చి 18 జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు ఈ చోరీ చేసినట్లు గుర్తించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 60 వేలు, కంటెయినర్‌ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఏసీపీ శ్రీనివాస్‌ తెలియజేశారు. హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే రూట్‌లో కోర్టు గేటు ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను కొందరు దుండగులు ధ్వంసం చేసి రూ. 8.64 లక్షలు దొంగిలించారు. దీంతో పోలీసులు నాలుగు స్పెషల్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో గాలించారు. 

చోరీకి ఉపయోగించిన కంటెయినర్‌ ఈ నెల 10న కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నట్లు గుర్తించారు. కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేసి, హర్యానాకు చెందిన ముషారఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. తన సోదరుడు సపత్, ఢిల్లీకి చెందిన ఆఫ్తాబ్, యూపీకి చెందిన సాజిద్, హర్యానాకు చెందిన ఫరీద్‌తో కలిసి చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇందుకోసం స్థానికంగా ఓ బైక్​, కారు దొంగతనం చేశామని, పని పూర్తయిన తర్వాత వాటిని తుమ్మనపల్లి వద్ద వదిలేసి రాజస్థాన్‌కు చెందిన తారీఫ్‌ రోడ్‌ వేస్‌ కంటైనర్‌లో హర్యానాకు వెళ్లినట్లు చెప్పారు. ముషారఫ్‌ నుంచి రూ. 60 వేలు, కంటైయినర్‌ స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. నిందితులను పట్టుకున్న ఎస్సై సాంబయ్య గౌడ్, సిబ్బంది రాజేశ్వరరావు, నెల్లి మోహన్‌, అవినాశ్‌, సంపత్, మధును ఏసీపీ అభినందించారు.