ఆపదకాలంలో అండగా.. కరోనా పేషెంట్లకు ఫుడ్ డెలివరీ

ఆపదకాలంలో అండగా.. కరోనా పేషెంట్లకు ఫుడ్ డెలివరీ

కరోనా సెకండ్‌‌ వేవ్‌‌లో దాదాపు ప్రతిఒక్కరు మహమ్మారి బారినపడుతున్నారు. ఫ్యామిలీలో ఒకరికి వస్తే మిగతావారికి కూడా సోకుతోంది ఈ వైరస్‌‌. దీంతో చాలా ఫ్యామిలీస్‌‌కి బయటికి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటివారి అవసరాలు తీర్చేందుకు ముందుకు వస్తున్నారు సిటీలోని చాలామంది. కొంతమంది డబ్బులకు ఫుడ్‌‌ వండిపెడుతుంటే. ఇంకొంతమంది ఫ్రీగా ఫుడ్‌‌ అందిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు శ్రీధర్, లక్ష్మీ సుజాత.

హైదరాబాద్‌‌ ఆర్కేపురంలోని వాసవికాలనీలో ఉంటున్నారు శ్రీధర్‌‌, లక్ష్మీ సుజాత దంపతులు. లక్ష్మీ ఫ్రెండ్‌‌ పేరెంట్స్‌‌ జూబ్లీహిల్స్‌‌లో ఉంటారు. ఆ ఇద్దరిదీ పెద్దవయసు. ఒంటరిగా ఉంటున్నారు. వారికి కరోనా సోకింది. బయటికి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆర్కేపురం నుంచి జూబ్లీహిల్స్‌‌కు వచ్చి పూట ఫుడ్‌‌ ఇవ్వలేని పరిస్థితి. ‘ఇలాంటి వాళ్లు ఇంకెంత మంది ఉన్నారో?’ అనిపించింది లక్ష్మీ సుజాతకు. అందుకే, వాసవీ కాలనీలో కరోనా బారినపడిన వారికి ఫుడ్‌‌ ఇవ్వాలని అనుకున్నారు. “ కరోనా పాజిటివ్‌‌ వచ్చి ఫుడ్‌‌ వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు కొవిడ్‌‌ రిపోర్ట్‌‌, లొకేషన్‌‌ షేర్‌‌‌‌ చేస్తే ఫుడ్‌‌ డోర్‌‌‌‌ డెలివరీ చేస్తాం” అంటూ ఒక చిన్న మెసేజ్‌‌ను అన్ని గ్రూపుల్లో పోస్ట్‌‌ చేశారు. తోచినంతలో 20 మందికి హెల్ప్‌‌ చేద్దామని మొదలుపెట్టారు. ఇప్పుడు రోజుకు దాదాపు 45 మందికి ఫ్రీగా ఫుడ్‌‌ ఇస్తున్నారు. ఇంట్లో వండి ప్యాకింగ్‌‌ చేస్తుంది లక్ష్మి. ఆమె భర్త, వాచ్‌‌మెన్‌‌ ఇద్దరూ వెళ్లి డెలివరీ చేస్తారు. వాసవీకాలనీ నుంచే కాకుండా కూకట్‌‌పల్లి, మాదాపూర్‌‌‌‌ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని చెప్తున్నారు వీళ్లు.         
సాధ్యమైనంత వరకు..
హోం ఐసోలేషన్‌‌లో ఉంటూ ఫుడ్‌‌ వండుకోలేని స్థితిలో ఉన్నవారికి ఫుడ్‌‌ సప్లై చేయాలని డిసైడ్‌‌ అయ్యాం. వాళ్లకు ఫుడ్​ మా ఆయన, వాచ్‌‌మెన్‌‌ వెళ్లి ఇచ్చి వస్తారు. ఉదయం రైస్, కర్రీ, రసం, పప్పు పంపిస్తాం. రాత్రి చపాతి, దోశ లాంటి టిఫిన్లు ఇస్తున్నాం. మా కాలనీ పరిధిలో రోజుకు 50 మంది వరకు ఫుడ్‌‌ పంపిస్తున్నాం. రోజుకు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మా ఏరియానే కాకుండా వేరే ప్రాంతాల వాళ్లు కూడా ఫోన్లు చేస్తున్నారు. వెసులుబాటు ఉన్నవాళ్లు ఎవరి పరిధిలో వాళ్లు సాయం చేస్తే బాగుంటుంది అంటున్నారు లక్ష్మీ సుజాత.