కేసీఆర్.. 70 వేల కోట్లు అప్పు పెట్టి వెళ్లాడు : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్.. 70 వేల కోట్లు అప్పు పెట్టి వెళ్లాడు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం వచ్చాక పది సంవత్సరాలు సింగరేణి సంస్థ నిర్లక్ష్యానికి గురైందని, అప్పటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేశారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో  సంవత్సరానికి కట్టాల్సిన అప్పుల విలువ రూ.6 వేల కోట్లు ఉండగా 10 ఏళ్ల తర్వాత రూ.70వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ తో ఉంటే రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 80 వేల పుస్తకాలు చదివిన అనుభవంతో కేసీఆర్ సంవత్సరానికి రూ.70 వేల కోట్ల అప్పు చెల్లించే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని అన్నారు. నేడు తెలంగాణ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరుకుందని, గత ప్రభుత్వం తప్పిదాలను ప్రజలకు వివరిస్తున్నామని ఆయన అన్నారు. 

ఒకటో తారీఖ జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి విడతల వారీగా 25వ తారీఖు వరకు జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకెళ్లిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి నెలలో నాల్గవ తారీఖున, రెండవ నెలలో ఒకటో తారీఖునే జీతాలు చెల్లించామన్నారు. రైతుబంధుపై కేటీఆర్, హరీశ్ రావులు అనేక ఆరోపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంకా అబద్దాలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టేందుకు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.