రోజువారీ కూలీకి కోటి రూపాయల లాటరీ

రోజువారీ కూలీకి కోటి రూపాయల లాటరీ

పఠాన్ కోట్: పంజాబ్ రాష్ట్రంలోని ఓ రోజు వారీ కూలీకి కోటి రూపాయల లాటరీ వరించింది. ఈనెల 14వ తేదీన ఉబుసుపోక వంద రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్ కు ఊహించని విధంగా కోటి రూపాయల బంపర్ బహుమతి దక్కడంతో అతని ఆనందానికి అవధుల్లేవు. పఠాన్ కోట్ జిల్లా అకోట గ్రామానికి చెందిన బోదరాజు రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా రాకతో కుటుంబాన్ని నెగ్గుకు రావడం కష్టంగా మారింది. అయినా సరే దొరికిన పని చేసుకుని గుట్టుగా రోజులు గడిపేస్తున్నాడు. ఈనెల 14వ తేదీన సెలవు రోజున ఇంటికి వెళ్తూ వంద రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొని ఇంటికి వెళ్లిపోయాడు. టికెట్ అమ్మిన లాటరీ నిర్వాహకుడు అశోక్ బోదరాజు ఫోన్ నెంబర్ కూడా టికెట్ నెంబర్ పక్కన తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అయితే ఆదివారం నాడు లూథియానాలో లాటరీ నిర్వాహకులు పెద్దల సమక్షంలో డ్రా తీయగా.. బోదరాజుకు కోటి రూపాయల లాటరీ తగిలింది. దీంతో అతను వెంటనే బోదరాజుకు ఫోన్ చేసి కోటి రూపాయలు బహుమతి వచ్చిన విషయాన్ని తెలియజేశాడు. దీంతో ఆదివారం భార్యా పిల్లలతో సంతోషంగా వేడుక చేసుకున్నాడు బోద రాజు. చుట్టుపక్కల వారికి మిఠాయి పంచి పెట్టాడు. లాటరీ డబ్బు అందిన వెంటనే బ్యాంకులో భద్రపరచుకుని.. తన ఇద్దరు కుమార్తెలను బాగా చదివించుకుంటానని చెబుతున్నాడు.