హైదరాబాద్, వెలుగు: దేశంలోని ఆగ్రో డీలర్లు సోమవారం చేపట్టిన బంద్ విజయవంతం అయింది. ఎరువులపై రవాణా చార్జీలు తగ్గించాలని, ఎటువంటి లింక్ లేకుండా సరఫరా చేయాలని, ధరలు తగ్గించాలని దేశ వ్యాప్తంగా అన్ని విత్తనాలు, ఎరువుల డీలర్లు స్వచ్చందంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల ఎరువుల డీలర్లు బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు.
ప్రభుత్వానికి లేఖ
ఎరువుల కంపెనీల మార్కెటింగ్ విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్ర మోహన్‌కు తెలంగాణ ఫర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ ఈ నెల 21 తేదీన లేఖ పంపింది. ఎరువుల కంపెనీల మార్కెటింగ్ విధానాలు, ఫ్రీ ఆన్ లోడ్ సమస్యలు, డీలర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను ఇందులో ప్రస్తావించింది. ఎరువుల సరఫరా, ధరల నియంత్రణ, డీలర్లకు సరైన రేట్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

