ప్రతి ఐదుగురిలో ఒకరు చదువుకు దూరం

ప్రతి ఐదుగురిలో ఒకరు చదువుకు దూరం

హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి అన్ని రంగాలను కకావికలం చేసింది. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివే ప్రతి ఐదుగురిలో ఒకరు చదువుకు దూరం కాగా, మరికొందరు యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారు. గతంతో పోలిస్తే పేదరికం మరింతగా పెరిగింది. డిజిటల్ క్లాసులతో రూరల్, అర్బన్  విద్యార్థుల మధ్య విభజన రేఖ ఏర్పడిందని, రాష్ట్రంలోని 11 శాతం యవతలో డిప్రెషన్ లక్షణాలు కనిపించాయని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘యంగ్ లైవ్స్’, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)’ అధ్యయనంలో వెల్లడైంది. 

సమాజంలోని వివిధ రంగాలపై కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఫస్ట్ వేవ్ నుంచి  యంగ్ లైవ్స్, సెస్ సంయుక్తంగా సర్వేలు చేస్తున్నాయి. గతంలో నాలుగు సర్వేలు నిర్వహించగా.. 2021 అక్టోబర్–డిసెంబర్ మధ్య ఐదో ఫోన్ కాల్ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ లో కలిపి 2,719 మంది నుంచి సర్వే బృందాలు వివరాలు సేకరించాయి. వీరిలో 1,855 మంది 19–20 ఏళ్ల వారు ఉండగా, 864 మంది 26–27 ఏళ్ల వాళ్లు ఉన్నారు.

47 శాతం మందికే క్వాలిటీ టీచింగ్
కరోనా వైరస్, లాక్‌‌డౌన్ విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలో 19–20 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులపై సర్వే చేయగా.. వందలో 22 మంది చదువుకు దూరమైనట్లు వెల్లడించారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు విద్యకు దూరమయ్యారని సెస్ స్టడీలో వెల్లడైంది. కరోనా కారణంగా స్టూడెంట్లు రెండు వర్గాలుగా విడిపోయారని, ఇంటర్నెట్ యాక్సెస్, ఆన్‌‌లైన్ క్లాసులు అందుబాటులో ఉన్న స్టూడెంట్స్ ఒకవైపు.. ఇవేవి అందుబాటులో లేని స్టూడెంట్లు మరోవైపు ఉన్నారని రిపోర్టులో పేర్కొన్నారు. క్వాలిటీ టీచింగ్ 47 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఈ స్టడీలో తేలింది. 2020 నవంబర్‌‌‌‌లో డిప్రెషన్ (మానసిక ఒత్తిడి) లక్షణాలు 9 శాతం మందిలో, యాంగ్జైటీ (మానసిక ఆందోళన) లక్షణాలు 8 శాతం మంది యువతలోనే కనిపించగా.. 2021 అక్టోబర్–డిసెంబర్ లో 11 శాతం యువతలో డిప్రెషన్, 10 శాతం యువతతో యాంగ్జైటీ లక్షణాలు కనిపించాయి.