న్యూఢిల్లీ: దేశంలో జమిలీ ఎన్నికల (వన్ నేషన వన్ ఎలక్షన్) నిర్వహణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టుకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 18) జరిగిన మంత్రి మండలి సమావేశంలో రామ్ నాథ్ కోవింద్ కమిటీ రిపోర్టుకు మోడీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా, జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. తగిన సూచనలు చేసేందుకు మోడీ సర్కార్ ఏర్పాటు చేసిన రామ్ నాథ్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు పాజిటివ్ రిపోర్టు ఇవ్వగా.. ఆ నివేదికకు మోడీ కేబినెట్ అప్రూవల్ తెలపడంతో జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా తొలి అడుగు పడింది. ఈ క్రమంలో జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌తో పాటు దేశంలోని మరో 15 పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకించాయి.
ALSO READ | ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం
జమిలీ ఎన్నికలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రియాక్ట్ అయ్యారు. వచ్చే నెలలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ.. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ చేసే ప్రయత్నమని అన్నారు. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ విజయవంతం కాదని.. దీనిని ప్రజలు కూడా అంగీకరించరని ఖర్గే పేర్కొన్నారు.